దుమ్ము రేపుతున్న 2018 కలెక్షన్స్.. గీతా ఆర్ట్స్ లెక్క తప్పలే

ఫస్ట్ వీక్‌లోనే ప్రొడ్యూసర్‌కి లాభాలు

Update: 2023-06-04 04:32 GMT


కంటెంట్ బాగుంటే చాలు.. తెలుగు సినీ అభిమానులకు అది మన భాష చిత్రమా..లేక పర భాష చిత్రమా అని ప్రాంతీయ బేధాలేవీ లేకుండా సినిమాను హిట్ చేసేస్తారు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ.. గత వారం మలయాళం డబ్బింగ్ మూవీగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన 2018 తుఫాన్ లాంటి కలెక్షన్స్ తో దుమారం రేపుతోంది. కేరళలో ఐదేళ్ల కిందట వచ్చిన వరదలను ఆధారంగా చేసుకొని మలయాళ దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ 2018 చిత్రాన్ని తెరకెక్కించారు. టొవినో థామస్, కుంజుకో బొబన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని స్ట్రైట్ సినిమాలను మించి వసూళ్లు రాబడుతోంది.

ఇక తెలుగులో ఈ సినిమాను బన్నీ వాసు విడుదల చేశాడు. భారీగా ప్రమోషన్లు లాంటివేవీ లేకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కాగా ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. బన్నీ వాసు ఈ సినిమా హక్కులను కోటి రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చులకు మరో పది లక్షలు ఖర్చు కావచ్చు. ఈ లెక్కన చూసుకుంటే బన్నీవాసుకు పెట్టిన దానికి మూడు, నాలుగు రెట్లు ఎక్కువే వచ్చింది.

ఈ సినిమా మరో మూడు రోజుల్లో సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు ముందే జరుపుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాతలు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మధ్య తెలుగులో తీస్తున్న డైరెక్ట్ సినిమాల కంటే.. అనువాద చిత్రాలతోనే మంచి ఫలితాలు అందుకుంటోంది. ఆ సంస్థ నుంచి గత ఏడాది వ్యవధిలో వచ్చిన స్ట్రెయిట్ సినిమాలు పక్కా కమర్షియల్, వినరో భాగ్యము విష్ణు కథ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. కానీ కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టింది. అలాగే తమిళ డబ్బింగ్ మూవీ ‘విడుదల’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. తాజాగా మలయాళ అనువాద చిత్రం ‘2018’ సైతం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.




Tags:    

Similar News