మంగళవారం.. టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలమంది నవ్వుకున్నారు. పైగా ఈ దర్శకుడు అజయ్ భూపతి ఫస్ట్ మూవీతో కంపేర్ చేసి మరోసారి అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీతో వస్తున్నాడు అనుకున్నారు. బట్.. ఒక్కో లుక్ రివీల్ చేస్తున్నప్పుడు అరే ఏదో కొత్తగా ఉందే అనుకున్నారు. టీజర్ చూశాక.. ఖచ్చితంగా డిఫరెంట్ కంటెంట్ తోనే వస్తున్నాడు అని అర్థమైంది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక చూసిన వాళ్లంతా మైండ్ బ్లోయింగ్ అనేస్తున్నారు. ఊహించిన కట్స్ తో ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. ఒక ఊరిలో జరిగే కథలానే ఉన్న ఈ మూవీ ట్రైలర్ ను బట్టి చూస్తే గ్రామంలో అక్రమం సంబంధాలు పెట్టుకున్నవాళ్లంతా హత్యలు చేయబడుతుంటారు. ఆ హత్యలు చేసేది ఎవరు.. ఎందుకు చేస్తున్నారు అనే కోణంతో పాటు దీని వెనక బలమైన నేపథ్యం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే టేకింగ్ పరంగా చూస్తే రీసెంట్ గా వచ్చిన విరూపాక్షలానూ.. కొన్ని షాట్స్ ను చూస్తే కాంతార సినిమాలానూ ఉంది. పైగా ఈ రెండు సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథే ఈ చిత్రానికి సంగీతం చేశాడు. ఆ ఛాయలు కూడా కాస్త కనిపిస్తున్నాయి. కాకపోతే విరూపాక్ష, కాంతార బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కాబట్టి.. ఆ రెండూ మిక్స్ అయినట్టుగా కనిపిస్తోన్న మంగళవారం కూడా మరింత పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు చాలామంది. నిజానికి ట్రైలర్ తర్వాత ఈ మూవీ లుక్కే మారిపోయింది. అంతకు ముందు వరకూ ఓ పది కోట్లు బిజినెస్ చేస్తే గొప్పే అనుకున్నారు. కానీ ట్రైలర్ తర్వాత 16కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అజయ్ భూపతి ఉన్న స్థితికి చాలా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి. ఆర్ఎక్స్ 100పై అస్సలు అంచనాలు లేవు. అయినా సూపర్ హిట్ అయింది. మహా సముద్రంపై భారీ అంచనాలున్నాయి. డిజాస్టర్ గా మిగిలింది. ఈ సారి రెండూ లేవు అనుకున్న టైమ్ లో ట్రైలర్ హైప్ తెచ్చింది. ఆ హైప్ తో బిజినెస్ లెక్కలు మారాయి. మరి బిజినెస్ కు తగ్గట్టు బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే నవంబర్ 17న శుక్రవారం విడుదల కాబోతోన్న మంగళవారం కొన్నవాళ్లందరికీ లాభాలు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో ఆ టైమ్ కు ఎన్నికల హడావిడీ బాగా ఉంటుంది కాబట్టి.. అదీ రిజల్ట్ పై ప్రభావం చూపించొచ్చు అనేది ట్రేడ్ అంచనా.