LEO : లియో, త్రిష.. ఓ విలన్ ..

Byline :  Babu Rao
Update: 2023-11-21 08:46 GMT

పదిమందికి తెలిసిన వాళ్లు.. పదిమందిలో ఉండేవాళ్లు మాటలు అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి నోరు జారితే తిరిగి ఆ తప్పును సరిదిద్దుకోవడం అంత సులువు కాదు. కొందరు చాలా వేగంగా తప్పును ఒప్పుకుంటారు. మరికొందరు కొన్నాళ్లు ఆగిన తర్వాత సారీ చెబుతారు. అయితే క్షమాపణ అడగటానికి కూడా సాధ్యం కానీ ఒక కమెంట్ చేశాడు కోలీవుడ్ లో ఒకప్పటి విలన్ కమ్ హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీఖాన్. మన్సూర్ అలీఖాన్ కు ఒకప్పుడు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. విలన్ గా తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించాడు. ఆ మధ్య ఆరోగ్యం పాడైంది. తిరిగి కోలుకుని ఇండస్ట్రీ ఇచ్చిన అవకాశాలను వాడుకుంటూ అడపాదడపా నటిస్తూ వస్తున్నాడు. అలాంటి మన్సూర్ రీసెంట్ గా విజయ్, త్రిష జంటగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన లియోలో ఓ చిన్న పాత్ర చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంటరాక్షన్స్ లో భాగంగా మన్సూర్ అలీఖాన్ ఓ వివాదాస్పదమైన కమెంట్ చేశాడు.

‘‘లియోలో త్రిషను రేప్ చేసే సీన్ లేనందుకు చాలా బాధపడ్డాను’’.. ఇదీ మన్సూర్ చేసిన కమెంట్. ఈ మాట త్రిషనే కాదు. ఏ మహిళను అన్నా ముమ్మాటికీ తప్పే. దీనికి సందర్భంతో పనిలేదు. వ్యక్తిత్వంతోనే పని. ఆ వ్యక్తిత్వ లోపంతోనే మన్సూర్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లోనే కాదు.. మొత్తం సౌత్ లోనే దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. తెలుగు నుంచి నితిన్ నుంచి చిరంజీవి వరకూ మన్సూర్ చెప్పింది తప్పు.. అన్నారు. లియో దర్శకుడు లోకేష్ సైతం మన్సూర్ వ్యాఖ్యలను ఖండించాడు. ఇలాంటప్పుడు తన మాటలకు క్షమాపణ అడిగితే అయిపోతుంది. బట్ మన్సూర్ మాత్రం తనేం తప్పు చేయలేదు అని ఖచ్చితంగా చెబుతూ ఇంకా బుకాయిస్తున్నాడు. ఎప్పట్లానే తన మాటలు వక్రీకరించారు అనే వక్ర మాటలు చెబుతున్నాడు. పైగా తనకు ఇద్దరు కూతుళ్లనీ.. అందులో ఒకమ్మాయి త్రిష ఫ్యాన్ అనీ తనెందుకు ఆ మాట అంటాను అంటూ డొంకతిరుగుడు మాటలు చెబుతున్నాడు.

ఇక మన్సూర్ కి ఇప్పటికే కోలీవుడ్ నడిగర్ సంఘం నోటీస్ లు ఇచ్చింది. అతని వ్యాఖ్యలపై వివరణ కోరింది. దాన్ని కూడా మన్సూర్ లెక్క చేయను అంటున్నాడు. పైగా వాళ్లకే టైమ్ ఇచ్చి ఆ లోగా నోటీస్ లు వెనక్కి తీసుకోవాలని చెప్పడం విశేషం. దీంతో పాటు తన వివరణ అడగకుండా ఖండించిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఇకపై కేవలం హీరోగా మాత్రమే నటిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి.. అతని దర్శకత్వంలో నటించను అన్నట్టే కదా..

ఏదేమైనా చాలా సందర్భాల్లో సెలబ్రిటీస్ ఒకటంటే మరోటిగా ప్రొజెక్ట్ అవుతుంది. అలాంటిది తను చాలా బాధ్యతారహితమైన మాట అన్నాడు. ఏ ఆడపిల్లా ఇలాంటి మాటలను సహించదు. ఏ మగాడూ ఆ మాటలను ఖండించకుండా ఉండలేడు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో కానీ.. మన్సూర్ ను సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఇక గతంలోనూ మన్సూర్ నోటి దురుసుతనంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇది వాటన్నటికీ మించిన విషయం. కాబట్టి అతనిపై నడిగర్ సంఘం నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Tags:    

Similar News