Matti Katha Movie Review : మట్టికథ రివ్యూ..

Update: 2023-09-22 08:13 GMT

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ యాసను అగౌరపరుస్తూ కేవలం కామెడీ కోసం మాత్రమే వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది. తెలంగాణ యాసలోనే సినిమాలు విడుదలై థియేటర్లలో దుమ్ముదులుపుతున్నాయి. తెలంగాణ పల్లెలు, మాట, పాట, కట్టు, బొట్టు ,కథ, సంస్కృతి ఇలా రకరకాల అంశాలను తెరపైన చూపిస్తూ యువ దర్శకులు సినీ రంగంలో తెలంగాణకు పెద్దపీట వేస్తున్నారు. ప్రేక్షకులు సైతం తెలంగాణ బ్యాక్ డ్రాప్‎లో వచ్చే సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, స్వచ్ఛమైన మనుషుల మనసులను, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే ప్రజల భావోద్వేగాలను స్పష్టంగా చూపించే కథాంశంతో వచ్చిన `మట్టి కథ` చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. పవన్‌ కడియాలా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైక్‌ మూవీస్‌ బ్యానర్లో అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదలకు ముందే మట్టి కథ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‎లో ఏకంగా 9 అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ పల్లె జీవితాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించటంలో యువ దర్శకుడు పవన్ కడియాల సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ నటనతో అందరికీ బాగా కనెక్ట్ అయ్యారు.

'మట్టి కథ'...అసలు కథ ఇదే :

తెలంగాణలోని మారుమూల పల్లెటూరు రుద్రారం. ఈ ప్రాంతంలో 2003లో జరిగే కథే మట్టి కథ. భూమయ్య (అజయ్‌ వేద్‌), శ్రీను(అక్షయ్‌ సాయి), యాదగిరి(రాజు ఆలూరి) జాన్ జిగిరీ దోస్తులు. వీళ్లంతా ఊరికి దూరంగా ఉండే ఓ కాలేజీలో చదువుకుంటుంటారు. కానీ ఏ ఒక్కరికీ చదువుమీద పెద్ద ధ్యాస ఉండదు. వారి భవిష్యత్తు గురించి ఎప్పుడూ సీరియస్‎గా ఆలోచించరు. తమ కుటుంబాల్లో జరిగిన సంఘటనలను కూడా పెద్దగా పట్టించుకోరు. ఆడుతూపాడుతూ జీవితాన్ని సరదాగా గడుపుతూ ఉంటారు. అలా సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని ముప్పు ఎదురవుతుంది. ఓ రోజు ఎగ్జామ్ సమయంలో కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్‏కు దొరికిపోతారు. గతంలోనే ఆ ఇన్విజిలేటర్‎తో ఈ ముగ్గురికి గొడవలు ఉండటంతో ఈ విషయం కాస్త సీరియస్ అవుతుంది. ఈ ఒక్క సంఘటన వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలను తీసుకువచ్చింది? వారి కుటుంబాల్లో ఎలాంటి అలజడిని సృష్టించింది. ఈ సమస్య నుంచి వీరంతా ఎలా బయటపడ్డారు? చివరికి ఏమైంది? అనేది థియేటర్లలో చూడాల్సిన కథ.

విశ్లేషణ...

తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచ ఆదరణల భిస్తోంది. ఈ మధ్యనే వచ్చిన బలగం సినిమా సంచలన విజయం సాధించింది. నాని నటించిన `దసరా` సినిమా కూడా అదే రేంజ్‌లో దుమ్ముదులిపింది. అదే తరహాలో వచ్చిన సినిమా మట్టి కథ. తెలంగాణ పల్లె జీవన విధానాన్ని 'మట్టి కథ' సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. 1990 నాటి పరిస్థితులు, ఆనాటి సామాజిక అంశాలు, చదువులు, కుటుంబాల పరిస్థితులు, ఇంటి వాతావరణం , మట్టిపై రైతుకు ఉండే మమకారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ పోకడలను దర్శకుడు చాలా స్పష్టంగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ భూమయ్య, అతని ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. వీరి చదువులు, ప్రేమలు,స్నేహం, చిలిపి పనులు వంటి సన్నివేశాలను చాలా సహజ సిద్ధంగా చూపించారు . ప్రతి సీన్ ఎంతో నేచురల్‎గా పండించారు.

ఇక సెకెండ్ హాఫ్‎లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, పోలీసుల అవినీతి, గ్రామ పెద్దల అవకాశవాదం, రైతుల నుంచి భూములు లాక్కునేందుకు చేసే కుట్రలు ఇలా ఎన్నో అంశాలను తెరకెక్కించారు. దర్శకులు రెండు రకాల కథలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఆ విషయంలో దర్శకుని పనితనం అందరినీ మెప్పిస్తుంది. మట్టి కథలో చాలా వరకు కొత్త యాక్టర్స్ కనిపిస్తారు. అనుభవం లేకున్నా ఎంతో సహజంగా నటించారు. తెలంగాణ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది మట్టికథ. అసలుసిసలైన పల్లె వాస్తవాలను చూపించే ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటోంది.

నటీనటులు:

అజయ్ వేద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా అయినప్పటికీ అజయ్ సహజత్వానికి ఎంతో దగ్గరగా నటించాడు. భూమయ్య పాత్రలో అచ్చం పల్లెటూరి అబ్బాయి ఫోటోకాపీలా కనిపించాడు. అతని ఫ్రెండ్స్ అక్షయ్‌ సాయి, రాజు ఆలూరి కూడా తమ క్యారెక్టర్లలో జీవించారు. శ్రీనుగా అక్షయ్‌ సాయి నటన బాగుంది. ఊర్లో ఇలాంటోడు కచ్చితంగా ఒకడు ఉంటాడు అనేలా నటించాడు . యాదగిరి పాత్రలో రాజు ఆలూరి పాత్ర భావోద్వేగానికి గురి చేసింది. కొన్ని సన్నివేశాల్లో రాజు పాత్ర కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక రాణిగా నటి మాయ మెప్పించింది. శేఖర్‌ పాత్రలో నటించిన బల్వీర్ సింగ్‌ నటన కూడా నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ తెలంగాణ గాయని కనకవ్వ మొదటిసారి వెండితెరమీద కనిపించారు. తన నటనతో అందరినీ మెప్పించారు. కొమురయ్య ఫేమ్ సుధాకర్ రెడ్డి తన పాత్రకు ప్రాణం పోశారు. మిగిలిన నటులు తమ పరిధిలో నటించి ప్రేక్షకులను అలరించారు.


టెక్నీషియన్లు:

మట్టి కథ సంగీతం మనసుకు హత్తుకుంటుంది. స్మరణ్‌ సాయి చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ది బెస్ట్ ఇచ్చారు. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. సాయినాథ్‌ కెమెరా పనితనం బాగుంది అనిపించింది. విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు పవన్ కడియాల తొలి చిత్రమే అయినా చాలా రియలిస్టిక్‌గా అనుభవమున్న వ్యక్తిలా కథను మలిచారు. తెలంగాణ యాసలో ప్రతి క్యారెక్టర్ మాట్లాడే డైలాగులు చాలా ఆకట్టుకున్నాయి. సినిమా అంటే కమర్షియల్ అనే భావనకు వెళ్లకుండా రియాలిటీగా దగ్గరగా మట్టికథను తీసి తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ మూవీ అందించారు మేకర్స్.

Tags:    

Similar News