మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్సైంది. జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ జరగగా మరో రెండు నెలల్లో వారు పెళ్లి పీఠలెక్కనున్నారు. ఈ జంట ఒక్కటయ్యేది అప్పుడేనంటూ ఓ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా పార్టీల్లో ఈ లవ్ బర్డ్స్ జంటగా కనిపించారు. నిహారిక పెళ్లి టైంలో లావణ్య చేసిన సందడి చూసిన వారందరికీ కాబోయే మెగా కోడలు ఆమేనంటూ ఓ క్లారిటీ వచ్చింది. ఇటీవలే రెండు కుటుంబాల పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్దం కూడా జరిగింది.
వరుణ్ - లావణ్యల ఎంగేజ్మెంట్ జరిగి రెండు నెలలు దాటినా వరుణ్, లావణ్యల పెళ్లి ఎప్పుడన్నది సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టులోనే వివాహం జరుగుతుందని వార్తలు వచ్చినా పలు కారణాలతో పెళ్లి వాయిదాపడుతూ వస్తోంది. అయితే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్, లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు నవంబర్ 1న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించడంలేదని కుటుంబసభ్యులు అతి తక్కువ మంది అతిధుల సమక్షంలోనే పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఎలక్షన్స్ బిజీలో ఉన్నందున పవన్ కల్యాణ్ సైతం ఈ పెళ్లికి అటెండ్ కాకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.