మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్లో తెలిపారు. ‘‘ వివిధ అంశాలపై ఇద్దరం మాట్లాడుకున్నాం. కొన్ని సంతోషకరమైన విషయాలను ఆయన నాతో పంచుకున్నారు. అదేవిధంగా నాకు అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉంది’’ అని చిరు ట్వీట్ చేశారు.
కాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్కు వెంకయ్య నాయుడు, చిరంజీవిలను కేంద్రం ఎంపిక చేసింది. రాజకీయ రంగంలో చేసిన సేవలకు గానూ వెంకయ్యకు, కళారంగంలో చిరుకు ఈ పురస్కారం అందించనుంది. వెంకయ్య, చిరు సేవలను కొనియాడుతూ పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మొత్తం ఐదుగురికి పద్మ విభూషన్, 17 మందికి పద్మ భూషన్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు ప్రతిష్టాత్మక అవార్డ్ భారతరత్న వరించింది.