అనవసరంగా నా పేరును వాడుకుంటే ఊరుకునేది లేదు.. Mohan Babu
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు గురించి తెలియని వారు ఉండరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించి.. అనంతరం ఎన్నో సినిమాల్లో విలన్‌గా, కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ అర్టిస్టుగా పలు పాత్రలు పోషిస్తూ.. అభిమానుల ప్రశంసలు పొందిన వ్యక్తి. నటుడిగానే కాకుండా.. సొంతంగా ఓ ప్రొడక్షన్ సంస్థను సైతం ఏర్పాటు చేసి నిర్మాతగా మంచి మంచి సినిమాలు తీశారు. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. తన వైవిధ్యాన్ని చాటుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా, ముక్కసూటి తత్వానికి చిరునామాగా సినీ జనాలు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు
కేవలం సినీనటుడిగానే కాక రాజకీయ నాయకుడిగానూ తెలుగురాష్ట్రాల్లో మోహన్ బాబు కు మంచి పేరుంది. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణంలోనే ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరిన ఆయన.. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మరణం అనంతరం టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కలిగే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు.. ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకి సీఎం వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తారని అంతా భావించారు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అయినా ఛాన్స్ ఇస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ అలాంటివేం జరగలేదు.
ఒకానొక సందర్భంలో.. తనను కొందరు రాజకీయాలలో మోసం చేశారని..అయితే పలానా వాళ్లు మోసం చేశారని తానెప్పుడూ చెప్పనని అన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయాలని అప్పుడే మనం రాజకీయాలలో ఉండగలం లేకపోతే రాజకీయ సన్యాసం తప్పనిసరంటూ చెప్పుకొచ్చారు. తనకు అలాంటి ఎత్తులు వెయ్యడం రాదని, అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తాజాగా సంచలన కామెంట్స్ చేశారు మోహన్ బాబు.
అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని సోషల్ మీడియా వేదికగా తన పేరును వాడుకుంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో... ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు తన పేరుని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్లుగా తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దయచేసి ఏ పార్టీ వారైనా.. తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తూనే వారందరికీ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పిన మోహన్ బాబు... ఎవరి అభిప్రాయాలు వారివి, అది వారి వారి వ్యక్తిగతమని అన్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమంటూ తన కోపాన్ని వ్యక్తం చేశారు . తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూనే.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నానంటూ ఓ లెటర్ ను షేర్ చేశారు. ఆ లెటర్ చివరలో ధన్యవాదాలతో మీ మోహన్ బాబు అంటూ ముగించారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024
అయితే మోహన్ బాబు పేరును వాడుకుంటున్న వ్యక్తులెవరనేది ప్రస్తుతం సందేహంగా మారింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతిస్తారనే విషయం తెలియదు . అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి దగ్గర బంధువు కాబట్టి.. ఆ పార్టీకే ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తారని ఓ టాక్. కానీ రాబోయే ఎన్నికల్లో తమ టార్గెట్ 175 సీట్లు అని, వై నాట్ 175 అంటూ గట్టి నమ్మకంతో జనాల్లోకి వెళ్లే వైసీపీకి మోహన్ బాబు మద్ధతు అవసరం లేదన్నది మరో టాక్. అలాంటప్పుడు ఆ పార్టీ నాయకులకి మోహన్ బాబు పేరు వాడుకోవాల్సిన అవసరం ఏముందని జనాలందరికీ వస్తున్న ఓ కామన్ సందేహం . ఇక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్లేమైనా మోహన్ బాబు పేరు వాడుకున్నారనుకుంటే.. టీడీపీతో ప్రస్తుతం ఎలాంటి సత్సంబంధాలు లేని మోహన్ బాబుతో వారికేం పని అని ఆ పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏ పార్టీ జనాలు తనను అనవసరంగా బదనం చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం మోహన్ బాబు చెప్పకుండా అందరినీ సస్పెన్స్ లో ఉంచారు.