మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు నట వారసుడుగా వచ్చాడు విష్ణు. కానీ ఆయన వారసత్వాన్ని నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో రెండు మూడు తప్ప కమర్షియల్ హిట్స్ లేవు. దీంతో విష్ణును హీరోగా మాత్రమే చూస్తారు తప్ప కనీసం స్టార్ హీరో అని కూడా చెప్పరు చాలామంది. బట్ తన నేపథ్యాన్ని బట్టి ఇండస్ట్రీలో తనూ ఓ టాప్ హీరోనే అని భావిస్తాడు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చినట్టుగా అనేక హామీలు ఇచ్చి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా భక్త కన్నప్ప కథను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి తనే నిర్మాత. అత్యంత భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తా అని ఆ మధ్య ప్రారంభోత్సవం రోజు చెప్పాడు.
భక్త కన్నప్ప కథను తెలుగులో కృష్ణం రాజు, కన్నడలో రాజ్ కుమార్ అద్భుతంగా చేశారు. నిజానికి ఈ కథతో ప్రభాస్ హీరోగా సినిమా నిర్మించాలనుకున్నాడు కృష్ణం రాజు. ఆయన పోయారు. ఇప్పుడు విష్ణు చేస్తున్నాడు. అయితే ఈ కథను పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నా అని చెబుతున్నాడు విష్ణు. దీనికి తోడు సినిమాలో భారీ తారాగణాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ను(ఈ విషయం ప్రభాస్ టీమ్ నుంచి అఫీషియల్ గా ఎవరూ చెప్పలేదు) ఒప్పించాడు. రీసెంట్ గా మోహన్ లాల్ ను సైతం తీసుకున్నాడు. ప్రభాస్ ను శివుడు పాత్రలో చూపిస్తాడు అనుకున్నారు. మరి మోహన్ లాల్ ను ఎలాంటి పాత్రలో చూపుతాడో.
ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ అట్రాక్షన్ యాడ్ అయింది. కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ను కూడా తమ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్టు ప్రకటించాడు విష్ణు. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ భక్త కన్నప్ప పాత్రను గొప్పగా పోషించాడు. ఇప్పుడు ఆయన తనయుడు ఈ కథలో ఓ పాత్ర చేయబోతున్నాడు. మొత్తంగా ఆర్టిస్టులు, బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాడు విష్ణు.
విశేషం ఏంటంటే.. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రం నుంచి తెలుగులో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాని హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఆమె ఏ భాషలోనూ బిజీ కాదు. అయినా డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తప్పుకుంది. ఈ ముక్క కూడా విష్ణుయే అనౌన్స్ చేయడం విశేషం.