Rashid Khan : ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
మ్యూజిక్ మ్యాస్ట్రో ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏండ్లు. కొన్నాళ్లుగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబరులో సెరిబ్రల్ అటాక్‌కు గురైన తర్వాత రషీద్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆయనను టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సాయంత్రం 6 గంటల వరకు రషీద్ ఖాన్ మృతదేహాన్ని కోల్‌కతాలోని పీర్‌లెస్ ఆసుపత్రిలో ఉంచనున్నారు. అనంతరం రాత్రికి భౌతికకాయాన్ని కోల్‌కతాలోని పీస్ హెవెన్‌కు పంపనున్నారు. రషీద్ అంత్యక్రియలు జనవరి 10న జరగనున్నాయి. రషీద్ ఖాన్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.
1968 జూలై 1న ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తర్ప్రదేశ్లో జన్మించారు. ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించిన గులాం ముస్తఫా ఖాన్ సంగీతంలో ఓనమాలు నేర్పారు. అనంతరం నిస్సార్ హుసేన్ ఖాన్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 11 ఏండ్ల వయసులో తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ఏడాది ఢిల్లీలో జరిగిన ఐటీసీ కాన్సెర్ట్ లో పాల్గొన్నారు. 14 ఏండ్ల వయసులో ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీలో భాగమయ్యాడు.
రషీద్ ఖాన్ 2004లో సుభాష్ ఘాయ్ చిత్రం కిస్నాతో తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో తోరే బిన్ మోహే చైన్ నహీ, కహెన్ ఉజాది మోరీ నీంద్ తదితర పాటలు పాడారు. ఆ తర్వాత 2007లో షాహిద్ కపూర్ జబ్ వి మెట్ చిత్రంతో మరింత పాపులర్ అయ్యాడు. ఆయనకు అభిమానుల కొరత లేదు. కానీ ఇతర గాయకులతో పోలిస్తే, రషీద్ బాలీవుడ్‌లో తక్కువ పాటలు పాడాడు. మై నేమ్ ఈజ్ ఖాన్, మౌసమ్, షాదీ మే జరూర్ ఆనా, హేట్ స్టోరీ 2 తదితర చిత్రాలకు గాత్రం అందించాడు.