Naseeruddin controversial : RRR, పుష్పలలో ఏముందబ్బా? సినిమాలపై బాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు..
రాజమౌళి ‘RRR’, సుకుమార్ ‘పుష్ప’ చిత్రాలు ఆలిండియా లెవల్లో ఎంత బజ్ క్రియేట్ చేశాయో మనకు తెలుసు (Naseeruddin Shah controversial comment ) అయితే ఈ చిత్రాలపై కొన్ని విమర్శలూ లేకపోలేదు. కమర్షియల్, క్రిమనల్ అంశాలను జోడించి మాయ చేశారని, వీటిలో కళాత్మక అంశాలు లేవని కొందరు విమర్శించారు. తాజా ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కూడా అవేం అంత గొప్ప సినిమాలు కావన్నారు. అంతేకాకుండా తను అసలు ఆ చిత్రాలనే చూడనేలేదని చెప్పారు. హీరోయిజాన్ని చూపడమే సినిమాల లక్ష్యం అనుకుంటున్నారని, కథకు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఇదే ధోరలో విదేశాల్లోనూ ఉందన్నారు.
‘‘మగవారిలో చేతగానివాళ్లమన్న భావన ఎక్కువై, ఇలాంటి హీరోయిజం చిత్రాలు తీస్తున్నారు. అమెరికాలోని మార్వెల్ యూనివర్స్ మూవీలూ ఈ బాపతువే. ఇప్పుడు మనదేశంలోనూ తీస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప మూవీలను నేనిప్పటివరకు చూడలేదు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూసి థ్రిల్ కావడం కాకుండా ఇంకే పొందుతారో నాకు అర్థం కావడం లేదు’’ అని షా అన్నారు. మణిరత్నం తాజా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బావుందని, ఆయన ఏదో అజెండా కోసమన్నట్టు కాకుండా మామూలుగా సినిమాలు తీస్తారని ప్రశంసించారు. నసీరుద్దీన్ సమాంతర చిత్రాలకు పేరు మోసినా కొన్ని కమర్షియల్ చిత్రాల్లోనూ నటించారు.
ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని, అవార్డులు అందుకోవడంలో గొప్పేమీ లేదని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. చాలా అవార్డులు లాబీయింగ్‌తో వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా పెద్దది. ఎంతోమంది మంచి నటులు ఉంటారు. వారిలో ఒకరు మాత్రమే ఉత్తమ నటుడని ఏడాదికోసారి అవార్డు ఇవ్వడంలో అర్థం లేదు. పాత్రకు న్యాయం చేయడానికి కష్టపడివాళ్లే గొప్పనటులు. నేను అవార్డులు చూసి మురిసిపోను. నేను ఫామ్‌హౌస్ కట్టుకుంటున్నప్పుడు నాకొచ్చిన రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను బాత్రూంలో హ్యాండిళ్లుగా మార్చా. బాత్రూంకు వెళ్లేవాళ్లందరూ వాటిని పట్టుకుంటారు కాబట్టి పట్టుకున్నవాళ్లందరికీ అవార్డు వచ్చినట్టే అవుతుంది’’ అని నసీరుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.