రూ.కోట్లు పెట్టి తీసిన సినిమాలకు ప్రస్తుతం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రాఫిక్స్ , ఫారిన్ లోకేషన్స్, క్లైమాక్స్ ఫైట్స్ అంటూ నిర్మాతల జేబులకు గట్టిగానే చిల్లుబడుతోంది. అలాంటిది ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా.. తెలంగాణ నేటివిటీతో చిన్న సినిమాగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది బలగం. తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు, పల్లెటూరి ప్రజలు.. మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాల్ని.. జబర్ధస్త్ కమెడియన్ వేణు ఎల్దండి... తన దర్శకత్వంతో కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ చిత్రం చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు అంటూ లేరు. ప్రతి గ్రామంలో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించేంతగా బలగం మూవీ ప్రజల్లోకి వెళ్ళింది. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడు వేణుని అభినందించారు. విడిపోయిన కొన్ని కుటుంబాలు ఈ సినిమాతో ఒక్కటైన ఘటనలూ ఉన్నాయి.
అయితే ఈ సినిమాపై కాస్త ఆలస్యంగా తన రివ్యూ ఇచ్చారు నేచురల్ స్టార్ నాని. లేట్ అయినా.. లేటెస్ట్‌గా బలగం చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. "బలగం చిత్రాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు చూశానో అర్థం కావడం లేదు. ఇంత మంచి సినిమాను ఇన్ని రోజులు మిస్ అయ్యానంటే నమ్మలేకపోతున్నా. తెలుగు సినిమాకి దక్కిన మరో గౌరవంగా బలగం చిత్రాన్ని భావించాలి. ఇలాంటి చిత్రాన్ని అందించిన వేణు ఎల్దండి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన ప్రియదర్శి, కావ్య.. కొమరయ్య, అతని కుటుంబ సభ్యులు అంతా నటనలో జీవించారు. మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలు" అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. నాని ట్వీట్ కి ప్రియదర్శి, వేణు ఇద్దరూ స్పందించారు. వేణు 'థాంక్యూ నాని అన్నా' అని రిప్లై ఇవ్వగా.. 'ఆలస్యం కాలేదు నాని అన్నా, థ్యాంక్యూ' అని ప్రియదర్శి కామెంట్ చేశాడు. నాని కూడా ఈ మధ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రం 'దసరా'లో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచింది.