CV Anand : అంతా అయిపోయాక బేబీ సినిమాకు నోటీసులా...

Byline :  Krishna
Update: 2023-09-14 15:16 GMT

తెలుగు సినిమా క్లైమాక్స్లలో అంతా అయిపోయాక పోలీసులు వచ్చి హ్యాండ్సప్ అంటారు. తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన సీపీ.. బేబీ సినిమాలో కొన్ని డగ్ర్స్ సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రగ్స్ను ప్రోత్సహించేలా సినిమాలో సీన్స్ ఉన్నాయని.. దీనిపై సినిమా నిర్మాత, డైరెక్టర్కు నోటీసులు ఇస్తామని చెప్పారు. ఈ అంశంమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ. జులై 14న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథ పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి వారెవ్వా అనిపించింది. థియేటర్స్లోనే కాదు ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు సృష్టించింది. అంతా అయిపోయాక ఈ మూవీకి ఇప్పుడు నోటీసులు అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అంటున్నారు.

సినిమా రిలీజ్ అయ్యే ముందే సెన్సార్ సభ్యులు మూవీని క్షున్నంగా చూస్తారు. అందులో ఏమైనా అభ్యంతరకర సీన్లు ఉంటే వెంటనే కత్తెర వేస్తారు. బేబీ సినిమాని సెన్సార్ బోర్డు సభ్యులు అంతా చూసి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇస్తామనడం విడ్డూరమనే కామెంట్లు వస్తున్నాయి. ఒకవేళ నోటీసులు ఇయ్యాలంటే సెన్సార్ సభ్యులకు ఇవ్వాలని అంటున్నారు. అయినా పెద్ద స్క్రీన్లో డ్రగ్స్ సీన్ వేసి.. సైడ్కు చిన్నగా హెచ్చరిక లైన్ పెడితే ఎవరు పట్టించుకుంటారని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఇలా అంతా అయిపోయాక నోటీసులు ఇస్తామనడం కంటే సినీ ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారితో చర్చిస్తే బాగుంటుందనే వాదనలున్నాయి. సినిమాలలో డ్రగ్స్, పోలీసులను చెడుగా చూయించడం వంటి చేయొద్దని వారితో చెబితే మంచిగుంటదని కొందరు సలహా ఇస్తున్నారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపించడం వల్ల సమాజంలో కూడా పోలీసులపై నమ్మకం పోతుందని.. కాబట్టి అటువంటి లేకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు.

ఇక పోలీసుల నోటీసులపై డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు. తమకు వచ్చిందని కేవలం అడ్వయిజరీ నోటీస్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నోటీసులపై సీపీకి అన్నీ వివరించామని.. ఆయన పలు సూచనలు చేశారని చెప్పారు. థియేటర్, ఓటీటీలో డ్రగ్స్ సీన్లకు డిస్క్లయిమర్ వేశామని.. అయితే యూట్యూబ్లో ఆడియో కంపెనీవాళ్లు డిస్క్లైమర్ తీసేసి పెట్టారని తెలిపారు. ఇటువంటి సీన్స్ సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని.. అవి లేకుండా చూడాలని సీపీ సూచించినట్లు సాయి రాజేష్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News