Tollywood Movies 2023 :నవంబర్ 3న .. వెండితెరపై పాంచ్ పటాకా
ఫ్రైడే వచ్చిందంటే థియేటర్స్ అన్నీ కొత్త సినిమా పోస్టర్స్ తో కళకళలాడుతుంటాయి. దసరా తర్వాత వారం పూర్తిగా డ్రైగా మారింది. ఎవ్వరూ ఆకట్టుకోలేదు. ఇక నవంబర్ 3 మాత్రం క్రేజీ సినిమాలున్నాయి. అందులో కాస్త ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తోన్న సినిమా పొలిమేర2. ఆల్రెడీ పొలిమేర ఓటిటిలో వచ్చినా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సీక్వెల్ కు సరిగ్గా సరిపోయే ఎండ్ ఇచ్చారు ఫస్ట్ పార్ట్ లో. అందుకే చాలామంది ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూశారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేలా ఉందీ ట్రైలర్. ప్రమోషన్స్ కూడా అగ్రెసివ్ గానే చేస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో పాటు ఈ సారి థ్రిల్లర్ గానూ కనిపిస్తోంది. పైగా దీనికీ కొనసాగింపు ఉంటుందట. అందుకే పొలిమేర2 కోసం ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుున్నారు.
ఈ లిస్ట్ లో యూత్ ను ఎక్కువ అట్రాక్ట్ చేస్తోన్న సినిమా కీడాకోలా. తరుణ్ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. అతని గత సినిమా ఈ నగరానికి ఏమైందికి రీ రిలీజ్ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కీడాకోలాకు పాజిటివ్ టాక్ ఉంది. ట్రైలర్ ఇంప్రసివ్ గా ఉంది. గత రెండు సినిమాలకు భిన్నమైన కంటెంట్ కనిపిస్తోంది. స్టార్ కాస్ట్ లో బ్రహ్మానందం తప్ప మరో అట్రాక్షన్ పెద్దగా లేదు. అయినా తరుణ్ భాస్కర్ వల్ల ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయంటున్నారు.
పలాస1979తో నటుడుగా బాగా ఆకట్టుకున్నాడు రక్షిత్. తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. తనూ వైవిధ్యమైన కథలే ఎంచుకుంటాడు. ఆ క్రమంలో నవంబర్ 3న నరకాసుర అనే సినిమాతో రాబోతున్నాడు. సెబాస్టియన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురించి ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తుండటం విశేషం. ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కంటెంట్ తో ఈ మూవీ రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. ట్రైలర్ చాలా చాలా ఇంప్రెసివ్ గానూ మేకింగ్ మెస్మరైజింగ్ గానూ కనిపించడంతో పాటు అసలు కథేంటీ అనేది అస్సలు రివీల్ చేయకుండానే సూపర్బ్ అనిపించుకుందీ టీమ్. ఈ మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి.
అంతా కొత్తవాళ్లతో ఆనంది హీరోయిన్ గా నటించిన విధి అనే తెలుగు సినిమా కూడా నవంబర్ 3నే విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. కానీ ప్రమోషన్స్ పరంగా చాలా వెనకబడి ఉన్నారు. ఒక పెన్ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోన్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్ లో ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు.
ఇక దసరా బరిలోనే నిలిచిన కన్నడ సినిమా ఘోస్ట్. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో దసరా బరి నుంచి తప్పుకుంది. కన్నడలో విడుదలైంది. శివన్న ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. కంటెంట్ వీక్ అనే రివ్యూస్ తో తర్వాత ఆ జోష్ కనిపించలేదు. పండగ సీజన్ ను కూడా పెద్దగావాడుకోలేకపోయారు అనే టాక్ ఉంది. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. మొత్తంగా ఒకే రోజు ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ ఐదుగురిలో అసలైన విజేత ఎవరనే రిలీజ్ తర్వాత మరోసారి చూద్దాం.