(Vishal) తమిళ సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. పలువురు సినీ తారలు అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి వారు సీఎంలుగా చక్రం తిప్పారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత మరికొంతమంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ కాంత్ పార్టీ పెట్టి రాజకీయాల్లో తనదైన ప్రభావం చూపారు. రజినీ కాంత్ పార్టీ పెట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నా.. ఆయన వెనకడుగు వేశారు. కమల్ హాసన్ పార్టీ పెట్టారు కానీ పెద్దగా ప్రభావం చూపలేదు.
ఇక ఇటీవల దళపతి విజయ్ సైతం కొత్త పార్టీ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన నూతన పార్టీని ప్రకటించారు. విజయ్ బాటలోనే విశాల్ నడవనున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చి సంపాదించాలని అనుకోవడం లేదని విశాల్ తెలిపారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సేవ చేయడానికి మాత్రమే వస్తానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేయడం లేదని.. భవిష్యత్లో కీలక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
విశాల్ ప్రస్తుతం ‘విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక తన తల్లి పేరు మీద దేవి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల చదువకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు, రైతులకు సాయం అందించినట్లు వివరించారు. రాజకీయ లబ్దిని ఆశించి ప్రజలకు సాయం చేయలేదని స్పష్టం చేశారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.