Srimanthudu: ఇక్కడితో ఆగను.. కొరటాల శివను జైలుకు ఈడుస్తా.. శరత్ చంద్ర
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ సినిమా తాను రాసిన నవలకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రెండ్రోజుల క్రితమే కొరటాల శివకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ చర్యలు ఎదుర్కోక తప్పదని ఆదేశించింది.
'చచ్చేంత ప్రేమ'ను దోచుకున్నారు
“శ్రీమంతుడు” సినిమా కథను అప్పట్లో స్వాతి పత్రికలో ప్రచురితమైన “చచ్చేంత ప్రేమ” అనే తన నవల ఆధారంగా తీసారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేని, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన నాంపల్లి కోర్టును కోరారు. 2012లో “చచ్చేంత ప్రేమ” అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురించడం జరిగిందని, అయితే తన అనుమతి లేకుండానే అదే కథ ఆధారంగా “శ్రీమంతుడు” మూవీని తెరకెక్కించారని శరత్ చంద్ర ఆరోపించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడి ధర్మాసనం నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది.
ఒక్క అక్షరం మార్చి..
దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. ఈ విషయంపై మీడియాలో పలు కథనాలు రావడంతో.. అసలు శరత్ చంద్ర ఎవరు? ఆయన రాసిన నవల ఏంటీ? అని సగటు తెలుగు ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, మీడియా సంస్థలు కూడా అసలు మేటర్ ఏంటో తెలుసుకునేందుకు శరత్ చంద్రను ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ వ్యవహరం గురించి స్పందించిన శరత్ చంద్ర.. తాను రాసిన నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారని అన్నారు. తాను దేవరకొండ అనే గ్రామంలో కథ జరుగుతున్నట్లు రాస్తే ఒక అక్షరం మార్చి దాన్ని దేవరకోట చేశారని చెప్పుకొచ్చారు.
కొరటాల తప్పు ఒప్పుకోవాలి
ఇప్పటికి కూడా శ్రీమంతుడు టీమ్ తనకు 15 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నదని, కానీ తనకు ఆ డబ్బు వద్దని అన్నారు. కొరటాల శివ తన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్లాల్సిందేనని, అలాగే ఇలా కాపీ కొట్టారు కాబట్టి సినీ పెద్దలు కల్పించుకుని అతను ఇక మీదట సినిమాలు చేయకుండా బహిష్కరించాలని శరత్ చంద్ర డిమాండ్ చేశారు. తన మేథో సంపత్తి వాడుకొని సినిమా చేసి కోట్లు సంపాదించారు కాబట్టి న్యాయంగా తనకు రావలసిన డబ్బు కచ్చితంగా రావాలన్నారు. ఒకవేళ వాళ్లు ఆ డబ్బు ఇవ్వనట్లయితే.. కోర్టు ద్వారా ఆ మేటర్ తేల్చుకుంటానని చెప్పారు.