Nushrratt Bharuccha: ఫెస్టివల్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న హీరోయిన్.. చివరికి ఏమైందంటే..
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిసిస్తోంది. ఈ మారణహోమంలో ఇప్పటికే ఇరుదేశాల్లో 500 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇరు దేశాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్థులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె ఆ దేశానికి వెళ్లారు. అయితే నుష్రత్ కు, ఆమె టీమ్ తో సంబంధాలు పూర్తి తెగిపోయాయి. ఆమె జాడ కోసం టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. నుష్రత్ భరూచాకు, ఆమె టీమ్ కు మధ్య చివరి సారిగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరి సారిగా కాల్ లో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆమె బేస్మెంట్లో అందరితో పాటు సురక్షితంగా ఉన్నానని తన టీమ్ మెంబర్ కు తెలిపింది. తరువాత ఆమె నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. కాల్ కనెక్ట్ కాకపోవడంతో ఆమె భద్రతపై అనుమానాలు పెరిగాయి. నుష్రత్ ను సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీమ్ మెంబర్ పేర్కొన్నారు. అయితే నుష్రత్ ఆచూకీ తెలిసిందని ఎంబసీ సహాయంతో ఆమె కాంటాక్ట్‌లోకి వచ్చిందని, ఆమె అక్కడ సురక్షితంగా ఉందని.. ప్రొడక్షన్ మెంబర్ ఒకరు తెలిపారు. ఇక నుష్రత్.. భారత్‌కు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది.
నుష్రత్ భరూచా.. చివరిసారిగా ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా అకెల్లిలో కనిపించారు. అందులో ఆమె ఓ పోరాట ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటకు రావడానికి కష్టపడే ఒక సాధారణ భారతీయ అమ్మాయి పాత్రలో నటించింది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా ఆమె రియాలిటీలో అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నారు. నుస్రత్ తెలుగులో శివాజీతో కలిసి తాజ్‌మహల్ సినిమాలో నటించింది. ఆమె సురక్షితంగా భారత్ కు తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.