ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా..?

Byline :  Babu Rao
Update: 2024-02-26 12:20 GMT

ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా. మిస్ వరల్డ్ 2017 హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోందీ సినిమాతో. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 1న విడుదల కాబోతోంది. ప్రస్తుతం వరుణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. గని,గాండీవధారి అర్జున చిత్రాలతో షాక్ లు తిన్నాడు. మధ్యలో ఎఫ్3 ఉన్నా.. అదేమంత ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు వరుణ్.అందుకే చాలామంది ఈ మూవీని ఆపరేషన్ వరుణ్ అని కూడా అంటున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కాకపోతే అది అతని కెరీర్ కే ఎఫెక్ట్ అవుతుందనేలా మాట్లాడుకుంటున్నారు. నిజానికి వరుణ్ తేజ్ చేసినన్ని ప్రయోగాలు అతనితో పాటు వచ్చిన హీరోలెవరూ చేయలేదు. కాకపోతే వైవిధ్యమైన కథలే కాదు.. అందుకు తగ్గ కథనం కూడా ఉంటేనే కమర్షియల్ గా విజయాలు వస్తాయి. లేదంటే కేవలం ప్రశంసలు మాత్రమే దక్కుతాయి. కొన్నిసార్లు అవీ ఉండవు. అందుకే ఈ మూవీతో మెగాప్రిన్స్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అంటున్నారు. పైగా పెళ్లి తర్వాత వస్తోన్న సినిమా కూడా కావడంతో ఆ కోణంలోనూ చూస్తున్నారు. లావణ్య వరుణ్ కు లక్ ను తెస్తుందా అని ఆలోచించే బ్యాచ్ కూడా ఉంటుంది కదా..? పెళ్లిళ్లు సినిమాలను హిట్ చేయలేవు అని తెలిసినా అనవసరమైన సెంటిమెంట్స్ ను వాడేస్తుంటారు. మొత్తంగా ఆపరేషన్ వాలెంటైన్ కోసం మెగాస్టార్ కూడా వచ్చాడు. అయినా తేడా కొడితే వరుణ్ కెరీర్ కు పెద్ద దెబ్బే పడుతుంది. అందుకే వరుణ్.. బ్లాక్ బస్టర్ కొట్టేయాలంతే.

నిజానికి పుల్వామా దాడి నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ రెండు మూడు సినిమాలు వచ్చాయి. అవేవీ అక్కడ ఆకట్టుకోలేదు. వీటిలో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన సినిమాలూ ఉన్నాయి. అయినా హిట్ టాక్ తెచ్చుకోలేదా సినిమాలు. మరోవైపు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు పెరిగాయి. పేరుకు దేశభక్తి అంటున్నారు కానీ.. ప్రస్తుతం దేశంలో ఈ టైప్ మూవీస్ కు మంచి డిమాండ్ ఉంది. అలాగని పాకిస్తాన్ ను తిట్టడం ద్వారానో.. జై శ్రీరామ్ అనడం ద్వారానో లేక భారత్ మాతాకీ జై అంటేనో సినిమాలు ఆడేస్తాయని చాలామంది నమ్ముతున్నారు. బట్ అది నిజం కాదు. ఖచ్చితంగా కథతో పాటు కథనమూ ఆకట్టుకోవాలి. అప్పుడే కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి.

ఆపరేషన్ వాలెంటైన్ మేకింగ్ పరంగా చూస్తే ఫెంటాస్టిక్ అనేలా ఉంది. స్టోరీ ఎలాగూ తెలుసు కాబట్టి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా వరుణ్ తేజ్ కు ఈ మూవీ ప్రస్తుతం చాలా కీలకం అనే చెప్పాలి. 

Tags:    

Similar News