Bigg Boss Telugu 7 Winner: నవ్విన నోళ్లను మూయించి.. టైటిల్ సాధించి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-18 02:03 GMT

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. తెలుగులోనే కాకుండా.. దేశ చరిత్రలో ఒక కామన్ మెన్‌ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. ‘అన్నా మల్లొచ్చినా.. అన్నా రైతు బిడ్డనన్నా.. అన్నా నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండన్నా’ అని ఏడుపు మొఖంతో , వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే వీడెవడ్రా బాబూ.. పిచ్చోడి మాదిరిగా ఉన్నాడు.. అని అనుకున్నారు చాలామంది. ఎన్నో హేళనలు.. ఇంకెన్నో అవమానాలు. ఆ వీడియోలు ఆపేసి.. బుద్దిగా పని చేసుకుని బతకొచ్చు కదా అని చాలామంది ప్రశాంత్‌కి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు.. అతను చెప్పిన ఒకే ఒక్క మాట.. ‘అన్నా.. నన్ను అంటున్నారు కదా.. అననివ్వండి.. నన్ను అనడం వల్ల వాళ్లు సంతోషపడుతున్నారంటే.. నాకు సంతోషమే.. వాళ్ల సంతోషం కోసం నేను ఇంకా కష్టపడతా’ అని అన్నాడు.

'మీరు నవ్వినా.. హేళన చేసినా.. నా గురి మాత్రం బిగ్ బాస్.. గుర్తుపెట్టుకోండి.. నా గురి మాత్రం తప్పదు.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే తీరుతా’ అని అన్నాడు. అన్నట్టుగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మిగిలిన18 మంది కంటెస్టెంట్‌లతో పోటీపడి.. తానేంటో నిరూపించుకున్నాడు. నవ్విన నోళ్లే మూతపడేలా .. తన గెలుపుతో అందరికీ షాక్ ఇచ్చాడు. హౌస్ లోకి ఓ సామాన్యుడిగా, రైతుబిడ్డగా అడుగు పెట్టిన ప్రశాంత్.. టైటిల్ గెలిచాక తాను ఇంతకుముందు చెప్పినట్లుగానే.. గెలుచుకున్న ప్రైజ్ మనీని రైతులకే ఇస్తానని ప్రకటించి అందరినీ మనసులను ఆకట్టుకున్నాడు.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అనగానే.. నాగార్జున కాళ్లపై పడి భోరున ఏడ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నా... మొదట సార్ గురించి చెబుతాను.. నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి రావాలి రావాలి అని ప్రతిరోజు ఇక్కడినే తిరిగినా.. కొన్ని రోజులు తినని రోజులు ఉండే.. నా ఇంట్లో వాళ్లకి తిన్నా అని అబద్దం చెప్పినా.. కానీ ఒక్కటి నమ్ముకున్నా.. నేను చేయగలను అని బాపుకి చెప్పినా.. బిడ్డా నువ్వు ఏది అనుకుంటే అది చేస్తావ్.. నువ్వు ముంగటికి నడువు.. నడిపిస్తా అని మాటిచ్చిండు.. ఆ మాటనే నన్ను ఈడదాకా తోలుకొచ్చింది. సార్‌ని పరిచయం చేయిపించింది. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టేలా చేసింది.

నేను చెప్పినట్లే.. 35 లక్షలు రైతులకు ఇస్తున్నా అని చెప్పినా.. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో దగ్గరుండి ప్రతి ఒక్క రూపాయి నేను కచ్చితంగా పంచుతా.. దానిలో మాట తప్పేదే లేదు.. జై జవాన్ జై కిసాన్.. ‘నేను రైతుల కోసమే వచ్చినా రైతుల కోసమే ఆడినా.. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది.. కారు మా బాబుకి.. బంగారం మా అమ్మకి ఇస్తా.. డబ్బు మాత్రం రైతులకు ఇస్తా.. థాంక్యూ సో మచ్ సార్.. మళ్లొచ్చినా అంటే తగ్గేదే లే’ అంటూ తన స్పీచ్ ముగించాడు ప్రశాంత్.




Tags:    

Similar News