ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నాడు ప్రభాస్. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామునే సాంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠం మొదటి ద్వారం నుంచి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ అధికారులు ప్రభాస్‌కు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ ప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రభాస్‌ను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రభాస్ తిరుమలలోనే ఉంటారు. అనంతరం తిరుపతిలో సాయంత్రం జరిగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రభాస్ ఉన్నారన్న సమాచారం అందడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు తిరుమలకు వచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు పోటీపడ్డారు.
త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తన కెరీర్ లోనే మొదటిసారిగా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రచారాలతో చిత్ర యూనిట్ బిజీబిజీగా ఉంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ప్రభాస్ చిత్రం బాహుబలి పార్ట్ 1 ప్రీ రిలీజ్ జరిగిన తిరుపతిలోనే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు అదిరిపోయే లెవెల్లో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లన్నింటినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగని రీతిలో మేకర్స్ ఆదిపురుష్ ప్రీరిలీజ్‌ను నిర్వహించనున్నారు. ఈవెంట్‌కి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. భారీ అయోధ్య సెట్‌ను నిర్మించి అందులో 50 అడుగుల హాలోగ్రామ్ ఇమేజ్‌ను ఏర్పాటు చేసి ఏర్పాట్లను ఇరగదీస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇది తొలిసారి. ముంబై నుంచి వచ్చిన 200 మంది డాన్సర్లు, స్పెషల్ సింగర్స్ ఆదిపురుష్‌లోని జై శ్రీరాం పాటను పాడనున్నారు. ఇదే ఈవెంట్ లో ఆదిపురుష్ మరో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్.