మెగా హీరోల సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. అదే ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలు తెరపై కనిపిస్తే రచ్చ మామూలుగా ఉండదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్. సముద్రఖని డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? మామాఅల్లుళ్లు ఆడియెన్స్ ను ఏ మేరకు మెప్పించారు?
చిత్రం : బ్రో
నటీనటులు : పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
రచన : సముద్రఖని, శ్రీవత్సన్, విజ్జి
స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం : సముద్రఖని
కథ ఏంటంటే
తండ్రి మరణంతో ఇంటికి పెద్ద కొడుకైన మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) కు చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు భుజాన పడతాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే అతనికి తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్ వారియర్, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఉంటారు. వారే లోకంగా బతుకుతుంటారు. అతని ఉరుకుల పరుగుల జీవితంలో ప్రియురాలు రమ్య (కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేకపోతాడు. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో మార్క్ చనిపోతాడు. అతని ముందు టైం గాడ్ టైటాన్ (పవన్ కల్యాణ్) ప్రత్యక్షమవుతాడు. తోబుట్టువులు ఇంకా సెటిల్ కాలేదని చేయాల్సిన పనులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయని అలాంటి తన జీవితానికి అంత తొందరగా పుల్ స్టాప్ పెట్టడం అన్యాయమని టైంగాడ్ తో మొరపెట్టుకుంటాడు. అతని బాధచూడలేక టైంగాడ్ టైటాన్ మార్క్ కు 90 రోజుల టైం ఇస్తాడు. అలా రెండో ఛాన్స్ దక్కించుకుని ఇంటికి చేరుకున్న మార్క్ 90 రోజుల్లో ఏం చేశాడు? మూడు నెలల్లో అతనేం నేర్చుకున్నాడన్నదే అసలు కథ.
సినిమా ఎలా ఉందంటే..
మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ బ్రో. అయితే మాతృతకు, తెలుగు రీమేక్ కు చాలా తేడా ఉంది. పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. అయితే తమిళంతో పోలిస్తే టైం గాడ్ పాత్ర నిడివి తెలుగులో చాలా ఎక్కువ. దాదాపు సినిమా మొత్తం పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. మార్క్ క్యారెక్టర్ ను ఆటపట్టిస్తూ పవన్ కల్యాణ్ చేసే హంగామా సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాలి. అయితే సినిమాలో ఎక్కువగా పవన్‌ని ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగినా సాయి ధరమ్ తేజ్ పాత్ర పడే సంఘర్షణ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఫస్టాఫ్ లో కామెడీ, సెకండాఫ్ లో భావోద్వోగాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ లో మార్క్ మనసును తేలికపరిచే సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే..
టైంగాడ్ టైటాన్‌గా పవన్ కల్యాణ్ తనదైన మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. డ్రామాను పండిస్తూ మార్క్ పాత్రకు తేజ్ న్యాయం చేశాడు. సాయిధరమ్ తేజ్ లవర్ రమ్యగా కేతిక శర్మ కనిపించేది కొద్దిసేపే అయినా అందంతో ఆకట్టుకుంది. మార్క్ చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ బాగా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సీన్ లో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్‌గా వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. తమన్ పాటల కన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు పనితీరు బాగుంది. త్రివిక్రమ్ మార్క్ అభిమానుల్ని మెప్పించింది. సముద్రఖని మాతృకలో చెప్పిన విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు చెప్పడంలోనూ విజయ సాధించాడనే చెప్పాలి.