తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లలో శుక్రవారం ‘తొలిప్రేమ’ సందడి చేసింది. సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా జూన్ 30న తొలిప్రేమను రీరిలీజ్ చేశారు. దీంతో పవన్ అభిమానులు హంగామా సృష్టించారు. పలుచోట్ల అభిమానం మితిమీరింది. విజయవాడ కపర్థి సినిమా ధియేటర్‌లో యువకులు అత్యూత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి సెకెండ్ షో సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు. స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్ లు వేస్తూ నానా హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా సినిమా తెర చించేసి, సీట్లు ధ్వంసం చేశారు. యజమాన్యం చెప్పినా వినకుండా థియేటర్‌ను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే థియేటర్ ధ్వంసం వెనక రాజకీయ కుట్రదాగి ఉందని యజమాన్యం ఆరోపిస్తోంది. పలువురు యువకులు అభిమానుల ముసుగులో వచ్చి గొడవ చేసినట్లు చెబుతున్నారు. అడ్డు వచ్చిన సిబ్బంది పై దాడి చేసి చేశారన్నారు. నిజంగా అభిమానులే చేశారా లేదా..రాజకీయ కారణాలతో చేశారా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని కోరారు. ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలని థియేటర్ యాజమాన్యం సూచించింది.