లహరి రెడ్డి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
హిమాయత్ నగర్కు చెందిన లహరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లహరిని ఆమె భర్తే చంపాడని గుర్తించిన పోలీసులు.. వల్లభ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. లహరిని చంపి.. ఆమె మృతిని వల్లబ్ గుండెపొటుగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా అంత్యక్రియలు నిర్వహించి.. దశదిన కర్మ రోజు 10వేల మందికి భోజనాలు పెట్టినట్లు చెప్పారు.
లహరి పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను నారాయణగూడ పోలీసులు వివరించారు. లహరిది హత్య అని పోస్ట్ మార్టంలో తేలిందని.. ఆమె శరీరంలోపల గాయాలున్నట్లు నారాయణగూడ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. శరీరంలో 2.5లీటర్ల బ్లడ్ కాట్ అయినట్లు రిపోర్టులో ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతన్ని విచారించగా.. మరికొన్ని విషయాలు తెలిశాయని చెప్పారు.
కొట్టి చంపాడు..
లహరిని వల్లభ్ కొట్టి చంపినట్లు శ్రీనివాస్ తెలిపారు. జుట్టు పట్టుకొని డోర్కు కొట్టడంతోపాటు ఆమె కడుపులో తన్నడంతో ఆమె అన్కాన్షియస్ అయ్యిందని చెప్పారు. అనంతరం హార్ట్ ఎటాక్ అని ఆస్పత్రిలో జాయిన్ చేశాడన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె దశదిన కర్మ రోజున 10వేల మందికి భోజనాలు పెట్టినట్లు గుర్తించామన్నారు.అతడిపై మర్డర్, సాక్ష్యాల తారుమారు కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
మా అల్లుడు మంచోడు..
లహరి తల్లిదండ్రులు మాత్రం తమ అల్లుడు మంచోడని.. వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పడం గమనార్హం.నిందితుడి బెదిరింపుల వల్లే వాళ్లు అలా చెప్పారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కొడుకే వల్లభ్‌రెడ్డి. వల్లభ్‌కు గతేడాది లహరి రెడ్డితో వివాహం జరిగింది. వీరు హిమాయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొడవలతోనే లహరిని వల్లభ్ హత్య చేసినట్లు సమాచారం.