ఒక్క కన్ను గీటడం (వైరల్ వింక్)తో ఓవర్‌నైట్‌లో స్టారైన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2019లో ఓరు అదార్ లవ్ అనే సినిమాలో హీరోని చూస్తూ కన్నుగీటిన సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక ఏడాది పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈమె కన్ను కొట్టే వీడియోలు.. కిస్ గన్ కాల్చే వీడియోలే తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా ఆ సినిమాలోని సీన్ల గురించి.. హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా ప్రకాశ్ వారియర్ గొప్పలకు పోయారు. ఇంటర్వ్యూలో తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిన వైరల్ వింక్‌ను ప్రియా చేసి చూపించారు. అనంతరం.. కన్నుగీటే ఐడియా తనదేనని చెప్పారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిని చూసిన ఓరు అదార్ లవ్ దర్శకుడు ఓమర్ లూలూ ఫేస్‌బుక్ వేదికగా ఆమెపై మండిపడ్డారు. "పిచ్చిపిల్ల.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో పాపం మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది" అంటూ సెటైర్లు విసిరారు. అంతేకాకుండా వైరల్ వింక్ ఐడియా తన సహనటుడు రోషన్‌దేనని ఓరు అదార్ లవ్ ప్రమోషన్స్‌లో ప్రియా చెప్పిన ఓ వీడియోను ఈ పోస్ట్‌కు యాడ్ చేశారు.