సినిమాల రీ రిలీజ్పై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా.. నిర్మాత అప్పిరెడ్డి
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పుట్టినరోజు లేదా ఇతర సందర్భాల్లో వారి పాత్ర చిత్రాలను 4కేకు మారుస్తూ మళ్లీ విడుదల చేస్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్, వసూళ్లు కూడా వస్తున్నాయి. మహేష్ పుట్టిన రోజు సంధర్బంగా పోకిరి(Pokiri) సినిమా రీ రిలీజ్ చేయడంతో మొదలైన ఈ ట్రెండ్.. అలాగే కొనసాగుతూ వస్తోంది. వీటికి కూడా థియేటర్స్ వద్ద నా నా హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల తమ సినిమాలపై ఎఫెక్ట్ పడుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత అప్పిరెడ్డి.
తాజాగా ఆయన నిర్మాణంలో వచ్చిన మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్(Mister pregnent). బిగ్ బాస్ ఫేమ్ సోహెల్(Sohel) హీరోగా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే రోజు ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి, ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. దీంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త వెనక్కి తగ్గింది.
ఈ విషయంపైనే నిర్మాత అప్పిరెడ్డి.. మిస్టర్ ప్రెగ్నెంట్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. "చిన్న సినిమాకి వీకెండ్ లో థియేటర్స్ దొరకడమే చాలా కష్టమైన రోజులు. అలాంటిది రీరిలీజ్లు అంటూ బడా హీరోల పాత సినిమాలు రిలీజ్ చేస్తుంటే మాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. అలా అని నేనేమి రీరిలీజ్ సినిమాలకు వ్యతిరేకిని కాదు. చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలు చేయొద్దని కోరుకుంటున్నాను. శుక్రవారం రోజు కాకుండా సోమ, మంగళవారాల్లో ఈ విడుదల చేసుకుంటే బాగుంటుంది. చిన్న నిర్మాతలకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఇదే విషయంపై త్వరలోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా మాట్లాడతాను" అని అన్నారు. తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని అన్నారు. అంతకుముందు కూడా పలువురు నిర్మాతలు ఇదే విషయాన్ని కూడా చెప్పారు.