multiplex : మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. టికెట్ రేట్ ఎంతంటే..?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాలకు చెందిన అతిధులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఈ మహాక్రతువును చూసేందుకు వెళ్లాలని లక్షలాది మంది మనసులో ఉన్నా అదిసాధ్యమయ్యే పనికాదు. ఈ క్రమంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో సిల్వర్ స్క్రీన్పై అయోధ్య రామయ్య తొలి దర్శన భాగ్యం కల్పించాలని మల్టీప్లెక్స్ ల నిర్వాహకులు నిర్ణయించారు.
పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం, రాముని ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం కేవలం రూ.100 ఛార్జ్ చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్ స్క్రీన్స్ పై ఈ మహాక్రతువులు చూడవచ్చు. దేశంలోని 70నగరాల్లో 170 కన్నా ఎక్కువ మల్టీప్లెక్సుల్లో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చారిత్రక ఘట్టాన్ని పెద్ద తెరపై చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు ప్రకటించాయి. రామ మందిర ప్రారంభోత్సవం లైవ్ టెలికాస్ట్ టికెట్లను పీవీఆర్, ఐనాక్స్ అఫీషియల్ వెబ్ సైట్లతో పాటు బుక్ మై షోలోనూ బుక్ చేసుకోవచ్చు.