Rakul Preet Singh : కాబోయే భర్తతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యేక పూజలు

Update: 2024-02-17 15:40 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమె పెళ్లి ముహూర్తం దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. గోవాలోని ఓ రిసార్టులో ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాజాగా పెళ్లికి ముందు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని ఆమె దర్శించారు. ఆలయంలో రకుల్, జాకీ ఇద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి పత్రికను తీసుకెళ్లి ఆ వినాయకుడికి సమర్పించి ఆశీర్వాదం పొందారు.

సిద్ది వినాయక ఆలయంలోకి రకుల్ తన ప్రియుడు జాకీతో కలిసి వెళ్లిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ డ్రెస్‌లో ట్రెడిషనల్‌గా రకుల్ కనిపించింది. అలాగే ప్యారెట్ గ్రీన్ కుర్తా ధరించి జాకీ ఆలయానికి వచ్చాడు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్‌లో రకుల్, జాకీల వివాహం జరగనుంది. ఈనెల 19వ తేది నుంచి ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి.

గోవాలో జరిగే రకుల్ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వెళ్లనున్నారు. పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరుకానున్నారు. మరోవైపు తమ పెళ్లి పర్యావరణానికి ఇబ్బంది కలిగించకూడదని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో పేపర్ వేస్ట్ లేకుండా అతిధులకు కేవలం డిజిటల్ ఇన్విటేషన్ కార్డులను మాత్రమే అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రకుల్, జాకీలో గుడికి వెళ్లిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News