వ్యూహం నుంచి మరో క్యారెక్టర్ పరిచయం చేసిన ఆర్జీవీ

Update: 2023-06-18 04:05 GMT

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో రానున్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీ రాజకీయ పరిణామాలు కథాంశంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కుతోంది. గతంలో వంగవీటి సినిమా నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ వ్యూహం సినిమాను సైతం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న జగన్, భారతి పాత్రధారులకు సంబంధించి ఇటీవలే కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసిన ఆర్జీవీ తాజాగా మరో క్యారెక్టర్ను రివీల్ చేశారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వర్కింగ్ స్టిల్ బయటికొచ్చింది. దీన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఏ క్యారెక్టర్ ఫ్రమ్ వ్యూహం అంటూ క్యాప్షన్‌ను ఇచ్చారు. ఈ ఫొటోలో కనిపించిన నటుడి గెటప్ మొత్తం చంద్రబాబును పోలి ఉంది.

గడ్డం, హెయిర్ స్టైల్, కాస్టూమ్స్ ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబును అచ్చుగుద్దినట్లు రామ్ గోపాల్ వర్మ ఈ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాడని ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. ఈ ఏడాది దసరా నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఆర్జీవీ ఈ సినిమాలో చూపించనున్నారు.

రాష్ట్ర విభజన, నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, జగన్ చేపట్టిన పాదయాత్ర, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని తదితర అంశాలను వర్మ తన వ్యూహంలో చూపించనున్నారు. రాజకీయంగా ఈ సినిమా పెను సంచలనం సృష్టిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News