కటెంటు, కథ, క్లారిటీ ఉండాలేగాని.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. ఈ కోవలోకే వస్తుంది రామన్న యూత్. ట్రైలర్, ప్రమోషనల్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా సందడి చేసిన ఈ సినిమా మొత్తానికి జనాల ముందుకొచ్చింది. సినిమా కథ ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పాలంటే సిద్ధిపేట జిల్లా అంక్షాపూర్ గ్రామానికి చెందిన నలుగురు యువకుల కథ ఇది. రాజుకు ఎమ్మెల్యే రామన్న అంటే పిచ్చి, ఆయన వెంట తిరుగుతూ ఎప్పటికైనా పొలిటికల్ లీడర్ కావాలని కలలు కంటుంటాడు. రాజు ఫ్రెండ్స్ అయిన చందు, రమేష్, బాలుతో కలిసి ఊరి యూత్ లీడర్ అనిల్ రామన్న యూత్ అసొసియేషన్ ఏర్పాటు చేస్తాడు.
దసరా పండుగ రోజు రాజు ఎమ్ముల్యే రామన్నతో కలిసి దిగిన ఓ ఫొటోతో ప్లెక్సీ ఏర్పాటు చేస్తాడు. అందులో యూత్ లీడరు అనిల్ తమ్ముడు మహిపాల్ ఫోటో ఉండదు. దాంతో కక్ష గట్టిన మహిపాల్ రాజు, అతని ఫ్రెండ్స్ అనిల్ ను కలవకుండా అబద్దాలు చెప్పి చిచ్చుపెడతాడు. లేబర్ గాళ్లు మా అన్న పేరు చెడగొడుతున్నారని మహిపాల్ నోరు జారడంతో అతనికి రాజు గ్యాంగుకు గొడవ అవుతుంది. దీంతో మహిపాల్ దమ్ముంటే తన అన్న సాయం లేకుండా ఎమ్మెల్యేను కలవాలని రాజు గ్యాంగుకు సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ సీరియస్గా తీస్కున్న రాజు అతని ఫ్రెండ్స్ ఎమ్మెల్యేను కలిసేందుకు సిద్ధిపేటకు వెళ్తారు. మరి వాళ్లంగా ఎమ్మెల్యేను కలిశారా? అసలు వాళ్లు హైదరాబాద్ కు ఎందుకు పోవాల్సి వచ్చింది. అక్కడ ఎలాంటి తిప్పలు పడ్డారు. జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజు లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? లేదా? అనేదే సినిమా
పార్టీల జెండాలు మోస్తూ ఇంటిని, అమ్మానాన్నల్ని పట్టించుకోకుంటే ఏమవుతుందన్న విషయాన్ని రామన్న యూత్ సినిమాలో చూపే ప్రయత్నం చేశారు. కొందరు లీడర్లు యూత్ ను తమ అవసరం కోసం ఎలా వాడుకుంటున్నారని, పాలిటిక్స్, లీడర్ వెంట తిరిగితే మధ్యతరగతి బతుకులు ఎలా ఆగమవుతాయన్న కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ నేటివిటీ, సిద్దిపేట లొకేషన్లు, యాస భాషతో డైలాగులు అదిరిపోయాయి. ముచ్చట్లు, పంచాయితీలు. దావత్ లు, మజాక్ సీన్లు చూసి పల్లెటూరి పోరగాళ్లు ఈజీగా కనెక్ట్ అయితారు.
హీరో, రైటర్, డైరెక్టర్ అయిన అభయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫస్టు సినిమా అయినా అనుభవమున్న డైరెక్టర్లాగా తీశాడు. యాక్టర్లలో చాలా మంది కొత్తవాళ్లే అయినా క్యారెక్టర్ కు తగ్గట్లు నటించారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బ్లర్ సీన్లు, బీప్ మాటలు లేకుండా ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడొచ్చు.
ఎమ్మెల్యేగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్, మహిపాల్ పాత్రలో విష్ణు, ఓ వైపు తండ్రికి భయపడుతూనే ఇంకోవైపు ఫ్రెండ్స్తో తిరుగుతూ గప్పాలు కొట్టే క్యారెక్టర్ లో అనిల్, ఆనంద్ చక్రపాణి, జబర్దస్త్ రోహిణి, యాదమ్మ రాజు తమ పరిధి మేరకు బాగా యాక్ట్ చేశారు. కమ్రాన్ మ్యూజిక్ బాగుంది. అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ నేచురల్ గా ఉంది. ఓవర్ డ్రామా, ఆర్బాటపు గ్రాఫిక్స్ లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది రామన్న యూత్.