రసమయి 'రుద్రాంగి' ఎట్లుందంటే...సినిమా రివ్యూ

Update: 2023-07-07 15:40 GMT

నిజాం , దొరల పాలనలో తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో చెప్పే సినిమా 'రుద్రాంగి' . అజయ్ సామ్రాట్ డైరెక్షన్‎లో రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. టాలీవుడ్ స్టార్ హీరో జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమల రామన్ లు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా నిజంగానే దొరల పాలనను కళ్లకు కట్టినట్లు చూపించిందా? నటీనటులు వారి పాత్రలకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చారా? కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా ఇప్పుడు తెలుసుకుందాం.


కథ ఏమిటంటే :



భీమ్ రావ్ రుద్రంగి గ్రామానికి దొర. ఈ పాత్రలో జగపతి బాబు కనిపించాడు. అతని భార్య మీరాబాయిగా విమలా రామన్ నటించింది. మొదటి భార్య ఉండగానే భీమ్ రావ్ రెండో దొరసానిని తీసుకువస్తాడు. ఆమె జ్వాలాబాయి దేశ్ ముఖ్ . ఈ పాత్రలో మమతా మోహన్ దాస్ నటించింది. జ్వాలాబాయి దేశ్ ముఖ్ దొరల కుటుంబానికి చెందిన మహిళన , కత్తి పట్టడం, తుపాకీ పేల్చడం, కుస్తీ పట్టడం వంటివి వచ్చు. ఇవన్నీ ఉన్నా ఆమెకి ఆడతనం లేదని దొర ఆమెని పక్కన పెడతాడు. భీమ్ రావ్ దొర మల్లేష్ అనే వ్యక్తిని తన దగ్గర నమ్మిన బంటుగా పెట్టుకుంటాడు. అయితే మల్లేష్‎పైన దొరసాని జ్వాలాబాయి మనసు పడుతుంది. ఇదిలా ఉండగా అడవికి వేటకి వెళ్ళిన భీమ్ రావ్ కి రుద్రంగి అనే అమ్మాయి కంట పడుతుంది. ఆమెని తన గడీకి తీసుకొచ్చి అనుభవించాలని అనుకుంటాడు. కానీ ఆమె అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆమెని వెతకమని మల్లేష్‎ని పంపిస్తాడు భీమ్ రావ్ . మల్లేష్ ఆమెని తీసుకువస్తాడు, కానీ రుద్రంగి తన భార్య అని వదిలేయమని దొరని వేడుకుంటాడు. కానీ దొర మల్లేష్ మాట వినడు, వినకపోగా రుద్రంగి గ్రామ ప్రజలను ఆమె కోసం కష్టాలు పెడతాడు. దొర రుద్రంగి కోసం ఏం చేస్తాడు? మల్లేష్, ఆ ఊరి ప్రజలు, దొర మీద తిరగబడ్డారా? ప్రజల బాధలు చూడలేక రుద్రంగి ఏమి చేసింది? మల్లేష్ మీద మనసు పడ్డ దొరసాని చివరకు ఏం చేస్తుంది? అన్నదే అసలు కథ.


రుద్రంగి ఎలా ఉందంటే :



తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‎తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. అదే కాన్సెప్ట్‎తో రుద్రాంగిని నిర్మించారు రసమయి. ఈ సినిమా ద్వారా తెలంగాణ నేపథ్యం, అప్పటి సంస్కృతి, సంప్రదాయాలు, దొరల పాలనలో ప్రజలు ఎలా నలిగిపోయారు, వంటి అంశాలన్నీ కూడా ఇప్పటి తరానికి చెప్పడం బాగుంది. డైరెక్టర్ అజయ్ సామ్రాట్‏కి తెలంగాణ దొరలు, గడీల మీద మంచి పట్టు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే 'రుద్రంగి' సినిమాలో చాలా వరకు సన్నివేశాలు కళ్ళకి కట్టినట్టుగా కనపడతాయి. రుద్రంగిలో నిజాం పాలనలో, దొరల అరాచకాలు, ప్రజల బాధలు, వారి తిరుగుబాటు అన్నింటిని చక్కగా చూపించాడు. కథ కొత్తగా ఉంది. ప్రతి సన్నివేశం కూడా ఆసక్తిని కలిగించింది. సినిమాను ఎక్కడా కూడ సాగదీసినట్లు అనిపించదు. సినిమాకి కొంచెం బడ్జెట్ పెంచి సాంకేతికంగా మరిన్ని మెరుగులు జోడించి ఉన్నట్లైతే రుద్రంగి వేరే లెవెల్‎లో ఉండేది. నాసిరకం సెట్స్, గ్రాఫిక్స్ వల్ల అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో నాచురాలిటీ మిస్ అయ్యింది. మొత్తం మీద అజయ్ మంచి సినిమా చేసాడు అనిపిస్తుంది.

ఎవరు ఎలా చేశారు :


దొర పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయాడు. నెగిటివ్ షేడ్‎లో జగపతిబాబు ఇరగదీశాడు. సినిమాకి ఆయువుపట్టు అతనే. జగపతి బాబు కెరీర్‎లో ఈ 'రుద్రంగి'లో చేసిన దొర పాత్ర నిలిచిపోయేలా ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన టాలెంట్‎తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. మమతా మోహన్ దాస్ చాలా కాలం తరువాత తెర మీద కనిపించింది. దొరసాని జ్వాలాభాయ్ పాత్రలో ఒదిగిపోయింది. అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విమలా రామన్ కూడా మీరాబాయి పాత్రలో మంచిగా పెర్ఫార్మ్ చేసింది. తెలుగు రాఖీ భాయ్ ఆశిష్ గాంధీ చక్కగా నటించాడు. రసమయి బాలకిషన్ కూడా ఒక పాటలో కనిపిస్తారు. కాలకేయ ప్రభాకర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.

రుద్రంగి కొత్త కథ. ఎలాంటి సాగదీత లేదు. సన్నివేశాలు, మాటలు, నటీనటుల అద్భుతంగా నటించారు. కొంచెం సాంకేతిక మీద దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది. అజయ్ సామ్రాట్ కి దర్శకుడిగా పాసయ్యాడు. మొత్తానికి రసమయి సినిమా బాగుంది.



Tags:    

Similar News