రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఇవాళ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన నవీన్ ఈ వీడియో క్రియేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరులోని పెదనందిపాడు గ్రామానికి చెందిన నవీన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఈ వీడియోను పోస్ట్ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. బీటెక్ చేసిన అతడు రష్మికకు బిగ్ ఫ్యాన్. ఈ వీడియోతో రెండు వారాల్లో అతని ఫాలోవర్ల సంఖ్య 90వేల నుంచి లక్షా 8వేలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు.
గతేడాది అక్టోబర్లో రష్మిక డీప్ పేక్ వీడియో వైరల్గా మారింది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఇన్ఫ్యూయెన్సర్ జారా పటేల్ లిఫ్ట్లోకి ఎంటరవుతున్న వీడియోను నిందితుడు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేశాడు. దీనిపై రష్మిక సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డీప్ ఫేక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. సోషల్ మీడియా కంపెనీలకు అడ్వైజరీ జారీ చేసింది. డీప్ ఫేక్ వీడియోలను తొలగించాలని, అవి సర్క్యులేట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
2017లో డీప్ ఫేక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఉపయోగించి ఆడియో, వీడియోలను మార్ఫ్ చేసే అవకాశముంది. అప్పటి నుంచి ఆ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వ్యక్తులు, సంస్థలు, చివరకు ప్రభుత్వాలను సైతం ఇబ్బందిపెడుతున్నారు.