సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈగల్.. ఆ రోజే రిలీజ్..

By :  Krishna
Update: 2024-01-04 16:14 GMT

సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. కోడిపందాల హవా ఒకవైపు.. కొత్త సినిమాల జోరు మరోవైపు. ఈసారి పంగడకు కూడా ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో పాంచ్ పటాకా ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఓ సినిమా రేసు నుంచి వెనక్కి తగ్గింది. ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, రవితేజ ఈగల్ పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి.

ఒకేసారి 5 సినిమాలు రిలీజైతే థియేటర్లు దొరకడం కష్టమవుతోంది. దీంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ 5 సినిమాల నిర్మాతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రవితేజ ఈగల్ సినిమా పోటి నుంచి వెనక్కి తగ్గింది. ఫిలిం ఛాంబర్ పెద్దల వినతితో ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ఈగల్ నిర్మాతలు ఒప్పుకున్నారు. ఈగల్ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి వుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైంది. తాజాగా జరిగిన చర్చల తర్వాత సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేస్తూ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.అయితే రవితేజ ఫ్యాన్స్కు మాత్రం ఇది నిరాశే అనే చెప్పాలి. అయితే రవితేజ చెప్పడంతోనే సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించామని నిర్మాతలు తెలిపారు. ఫ్యాన్స్ నిరాశ పడొద్దని.. కాలర్ ఎగరేసుకునేలా మూవీ ఉంటుందని చెప్పారు.

ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు స్పందించారు. ఓ సినిమా వెనక్కి తగ్గినంత మాత్రాన ఏదో జరిగినట్లు కాదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈగల్ సినిమా వాయిదా వేసుకున్నందుకు రవితేజ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గుంటూరు కారం, హనుమాన్‌ ఒకే రోజున విడుదల కాబోతున్నాయని.. అయితే ఈ సినిమాలు వేర్వేరుగా వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు.


Tags:    

Similar News