టాలీవుడ్ లో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎప్పటికీ రియలైజ్ కాలేకపోతున్నారు అనిపిస్తోంది. లేదంటే వస్తే ఒక్కసారిగా పోలోమని అందరూ వచ్చేస్తారు. లేదంటే మంచి డేట్స్ ను కూడా ఖాళీగా ఉంచేస్తారు. సెస్టెంబర్ లో అలాగే జరిగింది. 15,22 తేదీలను వదిలేసి, అంతా 28న వచ్చారు. ఒక్కటీ హిట్ అనిపించుకోలేదు. ఇక ఈ నెలలో కూడా 13వ తేదీ ఉన్నా.. ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు గత శుక్రవారం వచ్చాయి. మ్యాడ్ తప్ప మిగతావేవీ కమర్షియల్ గా ఆకట్టుకోలేదు. వీటిలో కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా బావున్నా కూడా ఈ గుంపులో పడి లాస్ అయిపోయాయి. ఇక డిసెంబర్ పరిస్థితి కూడా ఇదే కాబోతోంది. డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా 19 -23 తేదీల వరకూ వరుసగా సినిమాలు అనౌన్స్ అయ్యి ఉన్నాయి. ఇదంటే పండగ సీజన్ కాబట్టి ఫర్వాలేదు అనుకున్నారు. బట్ సడెన్ గా 22న సలార్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ సినిమాలన్నీ చెల్లా చెదురవుతున్నాయి. అలా అయినవి తలో డేట్ చూసుకుంటే ఫర్వాలేదు. మళ్లీ అంతా కలిసి ఒకే తేదీలో రావడంతో ప్రాబ్లమ్ తప్పదంటున్నారు విశ్లేషకులు.
డిసెంబర్ లో క్రిస్మస్ కు ప్లాన్ చేసుకున్న సినిమాల్లో సైంధవ్ సంక్రాంతికి వెళ్లింది. అక్కడ భారీ పోటీ ఉంది. ఇక మిగతావి డిసెంబర్ 8కి షిఫ్ట్ అవుతున్నాయి. ఈ డేట్ లో ఇప్పటికే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలైంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలున్నాయి. ఇప్పుడు వీరికి తోడుగా క్రిస్మస్ కు రావాలనుకున్న నితిన సినిమా వస్తోంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తోన్న ఎక్స్ ట్రార్డినరీ మేన్ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
మరోవైపు ఇదే డేట్ కు నాని హాయ్ నాన్న సినిమా కూడా వస్తుందని కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. దీంతో పాటు తమిళ్ నుంచి ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా డిసెంబర్ 15 నుంచి ప్రీ పోన్ అయ్యి 8కే వచ్చారు. చూస్తే ఇప్పటికి అఫీషియల్ గా నాలుగు సినిమాలున్నాయి. నాని కూడా వస్తే 5 అవుతాయి. ఇంకా కొందరు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇలా అంతా ఒకేసారి వస్తే వీరి కంటెంట్ బావున్నా.. కలెక్షన్స్ తగ్గుతాయి. థియేటర్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. మొత్తంగా టాలీవుడ్ లో ఉంటే ఫుల్ లేదంటే నిల్ అన్నట్టుగా మారింది పరిస్థితి.