మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా నామకరణం చేసుకున్నాడు. తన తల్లి ఎప్పటికీ తనతోనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇదే సంతోషంలో మరో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. టాలీవుడ్‌లో సుప్రీం హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. తన తల్లి పేరుపై ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించాడు. దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరుపై ఓ సరికొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి నిర్మాతగా మారాడు.
ఈ బ్యానర్‌పై ఇది వరకే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తెరకెక్కాయి. సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిమ్ కూడా ఈ ప్రొడక్షన్స్ పేరుపైనే విడుదలైంది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సాయి దుర్గ తేజ్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తల్లిపేరుపై నిర్మాణ సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. తనకు సహకరించిన నిర్మాత దిల్ రాజు తమ నిర్మాణ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
'సత్య' సినిమా టీమ్‌తో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు సాయి దుర్గ తేజ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. విరూపాక్ష మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆ తర్వాత బ్రో మూవీ చేశాడు. ఇప్పుడు గాంజా శంకర్ అనే మూవీలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో నటించడమే తన నెక్ట్స్ టార్గెట్ అని సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చాడు.