మాస్ సినిమాలంటే నిన్నటి వరకూ ఒక లెక్క ఉంది. ఆ లెక్కలు మారాయిప్పుడు. మనోళ్లూ హాలీవుడ్ ను మించే యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతున్నారు. ముఖ్యంగా సౌత్ లో మొదలైన ఈ ట్రెండ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది బాలీవుడ్. ఈ క్రమంలో వచ్చిన టైగర్ సిరీస్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన టైగర్ మూవీస్ తో పాటు పఠాన్, జవాన్ లు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సిరీస్ లోనే ఇప్పుడు టైగర్ 3 వస్తోంది. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 ట్రైలర్ విడుదలైంది.
ఏక్ థా టైగర్.. టైగర్ జిందా హై వంటి మూవీస్ తో యశ్ రాజ్ స్పై యూనివర్స్ సూపర్ హిట్స్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లో వస్తోన్న మూడో సినిమా టైగర్ 3. టైగర్ సిరీస్ మూవీస్ లో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గానే కనిపిస్తున్నాడు. అయితే ఈ సారి అతని దేశభక్తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ మధ్య వచ్చిన టీజర్ లో చెప్పారు. ట్రైలర్ చూస్తే దేశమా, కుటుంబమా అనే సంకట స్థితిలో కనిపిస్తున్నాడు. తన వల్ల కుటుంబాన్ని కోల్పోయిన ఒక పాకిస్తానీ ఉగ్రవాది టైగర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఇది పర్సనల్ కాబట్టి దేశం సహాయం తీసుకోకుండా తన పాత రా ఫ్రెండ్స్ సాయంతో మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటీ.. ప్రభుత్వానికి ఎలా జవాబుదారీ అయ్యాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. ఇందుకోసం చేసిన సాహసాలేంటీ అనేది ఈ టైగర్3లో కనిపించబోయే అంశాలు.
ట్రైలర్ అవుట్ స్టాండింగ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తోంటే గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా ఉన్నాయి. సల్మాన్ తో పాటు కత్రిన కూడా చాలా రిస్కీ షాట్స్ లో కనిపించింది. దేశంలో శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత... అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశాలతో కట్టిపడేసేలా ఉంది. తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఇంటర్నల్ గా దేశ సమగ్రతను కాపాడేందుకు పాకిస్తానీ ఉగ్రవాదికి చిక్కిన టైగర్ తో అతను ఒక మాట అంటాడు. ‘ఒక ఏజెంట్ కి దేశ ద్రోహం కన్నా నీచమైన చావు ఉండదు.. వెల్కమ్ టు పాకిస్తాన్.. టైగర్..’ అన్న విలన్ కు .. ‘ టైగర్ కు శ్వాస ఉన్నంత వరకూ ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు’ అని కౌంటర్ ఇచ్చిన డైలాగ్ ను బట్టి.. ఇది మరో రేంజ్ మూవీ కాబోతోందని అర్థం అవుతోంది. ఈ నవంబర్ 12న ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని మనీష్ శర్మ డైరక్ట్ చేశాడు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మరి పఠాన్, జవాన్ తర్వాత ఆ మూవీస్ కలెక్షన్స్ టార్గెట్ గా వస్తోన్న టైగర్ 3 ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.