సమంత.. ఫస్ట్ మూవీతోనే ఏదో మాయ చేసి తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఏ మాయ చేశావె సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చెన్నై చిన్నది ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. సమంత నటిస్తే హిట్అనే టాక్ కూడా ఓ దశలో వినిపించింది. అఫ్ కోర్స్ ఆమె పేరు చెప్పగానే భయపడిపోయే ఫ్లాపులూ ఉన్నాయనుకోండి. ఇక పెళ్లి,వెబ్ సిరీస్, విడాకులు, మయోసైటిస్ అంటూ నిత్యం వార్తల్లోనే ఉంటూ వస్తోన్న సమంత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ సోమవారంతో తను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి 14యేళ్లు పూర్తవుతోంది. మరి ఈ 14 ఇయర్స్ లో సమంత ఏం సాధించింది.. ఏం పోగొట్టుకుంది..?
సమంత పేరు చెప్పగానే తెలియకుండా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ గుర్తొస్తాయి. ఏ పాత్ర చేసినా బలమైన ఇంపాక్ట్ చూపించడం తన టాలెంట్స్ లో ప్రధానంగా కనిపించే లక్షణం. తనకు డబ్బింగ్ చెప్పేది చిన్నయినే అయినా.. ఆ వాయిస్ సమంతకు సెట్ అయినంత సహజంగా మరెవరికీ సెట్ కాలేదు అనేది నిజం. ఏ మాయ చేశావెతో బ్లాక్ బస్టర్ అందుకుని ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్స్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విశేషం ఏంటంటే.. నాగ చైతన్యకూ ఇదే ఫస్ట్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి చిత్రాల్లో నటించారు. మజిలీకి ముందు పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. అందుకు కారణాలు ఇప్పుడు అప్రస్తుతం అనుకోవచ్చు. ఇక కెరీర్ పరంగా చూస్తే సమంత ఖాతాలో బృందావనం, దూకుడు, ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, అత్తారింటికి దారేదీ, మనం, కత్తి, సన్నాఫ్ సత్యమూర్తి, తెరి, మెర్సల్, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి ఎవర్ గ్రీన్ మెమరబుల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ అన్ని సినిమాల్లో హీరోయిన్ గా తన పాత్రలు బలంగానే ఉన్నాయి. అవన్నీ ఓ ఎత్తైతే.. పుష్ప 1 లో చేసిన ఐటమ్ సాంగ్ మరో ఎత్తు అనిపించేలా టాలీవుడ్ తో పాటు మొత్తం కంట్రీనే మెస్మరైజ్ చేసింది. ఈ పాటకు ముందే తనకు విడాకులు అయి ఉండటం.. ఆ పాటలో అంతకు ముందెప్పుడూ లేనంతగా స్కిన్ షో చేయడం చర్చనీయాంశంగా మారింది. విడాకులు విషయంలో తన వరకూ తాను బాధితురాలిగానే అనుకుంటుంది సమంత. అందుకు ఆమె స్నేహితులు, సన్నిహితుల అండ కూడా ఉండటంతో ఆ బాధ నుంచి త్వరగానే బయట పడింది. ఆ తర్వాత యశోద, శాకుంతలంతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రాలు చేసింది. వీటిలో ఖుషీ మాత్రమే విజయం సాధించింది. వీటికి ముందే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధితోనూ యుద్ధం చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. ఒక యేడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వ్యక్తిత్వం పరంగా సమంత ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంది. సామాజిక అంశాల్లోనూ పాలు పంచుకుంది. వ్యక్తిగత విషయాలు ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోవడం ఎంత ప్లస్ అయిందో.. పెళ్లి తర్వాత అంత మైనస్ అయిందనే వారూ ఉన్నారు.
ఇక ఏ మాయ చేశావెకు బెస్ట్ డెబ్యూట్ గా ఈగ, అ ఆ చిత్రాలకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకుంది. ఈగ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్ నుంచీ తనే ఫిల్మ్ ఫేర్ అందుకుంది. ఇలా ఒకే సినిమాతో రెండు భాషల్లో అవార్డులు గెలుచుకున్న మూడో నటి సమంత. ఇక ఏ మాయ చేశావె, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలకు తెలుగు నుంచి ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది. ఇలా 14యేళ్ల కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ తో పాటు మంచి అవార్డులు సాధించిన నటిగా సమంతతో సాటి వచ్చే హీరోయిన్లు లేరనే చెప్పాలి. ఇక తన కెరీర్ లో చాలామందిని ఆశ్చర్యపరిచింది.. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లోని పాత్ర. ఈ పాత్ర చేయడానికి ఎంతో గట్స్ కావాలి. అవి ప్రదర్శించింది కాబట్టే ప్రపంచం అంతా తన ప్రతిభను మెచ్చుకుంది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ప్రిపేర్ అవుతోన్న శామ్ ఈ ఇన్నింగ్స్ లో ఎన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.