Telangana MLC Election : MLC టికెట్ కోసం బీఆర్ఎస్‌లో ఏడుగురు కీలక నేతలు పోటీ?
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ ఎలక్షన్స్ లో గెలవడంతో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం (జనవరి 4) కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 11న ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నామినేషన్ల స్వీకరణ మొదలుపెడుతున్నట్లు తెలిపింది. జనవరి 29న పోలింగ్, ఫిబ్రవరి 1న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో నేతలకు పైరవీలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది.
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 15 మంది పోటీ పడుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడుగురు పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తమకే టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. అందులో గంప గోవర్దన్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి గులాబీ బాస్ కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారనేది తెలియాల్సి ఉంది.