Sharathulu Varthisthai: షరతులు లేకుండా అందరూ చూడాల్సిన సినిమా
ఒక మంచి సినిమా చూసినప్పుడు కలిగే అనుభూతి వేరే ఉంటుంది. అలాంటి అనుభూతి నాకు షరతులు వర్తిస్తాయి చూసినప్పుడు కలిగింది.ముఖ్యంగా తెలంగాణ సినిమా అంటే ఇలాగే ఉంటుంది అంటూ వెండితెరపై మద్యం ఏరులై పారుతూ.. ఆవారాగా తిరిగే కుర్రకారును చూపిస్తూ.. ఓ దశలో తెలంగాణ సినిమా అంటే వెగటు పుట్టేలా చేసిన తరుణంలో.. ఈ ప్రాంతపు ఆత్మను, ఈ యాసలోని సొగసును, ఇక్కడి మధ్య తరగతి బ్రతుకుల్లోని అనుబంధాలను, అభ్యుదయాలను అందంగా చూపిస్తూ రూపొందిన సినిమానే షరతులు వర్తిస్తాయి.
పెళ్లి చూపులును మినహాయించి, ఈ మధ్య కాలంలో బలగం తర్వాత అంత గొప్ప ప్రభావవంతంగా కనిపించిన సినిమా అంటే అతిశయోక్తి కాదు. సహజమైన పాత్రలు, సహజమైన లొకేషన్స్ తో మన చుట్టూ ఉండే మనుషుల తీరు గురించి ‘తీర్పులు’ చెప్పకుండా నేర్పుగా చూపిన సినిమా. ఒక కొత్త దర్శకుడు.. సినిమా తాలూకూ హడావిడీ వాసనలు అంటకుండా.. తను చెప్పాలనుకున్న కథను అందంగా, అద్భుతంగా చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు ఎన్ని భారాలు మోశాడో కానీ.. తన సినిమాను అందమైన తీరానికి చేర్చాడు.
కరీంనగర్ లోని సావిత్రిబాయి ఫూలే నగర్ చుట్టూ అల్లుకున్న కథ. అక్కడే ఓ షాప్ లో పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచే విజయశాంతి, తండ్రి మరణంతో దక్కిన చిన్న ప్యూన్ ఉద్యోగం చేస్తోన్న చిరంజీవి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇద్దరి వ్యక్తిత్వాలూ గొప్పగా కనిపిస్తాయి. ఒకరంటే ఒకరిని చాలా ఇష్టం. చిరంజీవి తన ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటూ.. ఎలాంటి అత్యాశలకూ పోకుండా ఉన్నంతలోనే ఉన్నతంగా బ్రతకాలనుకునే వ్యక్తి. తను ప్రేమించిన వాడికి పెద్ద కష్టం వచ్చి అతని తరఫువారెవరూ సాయం చేయకపోతే.. తన సంపాదనంతా ఇచ్చి అతన్ని ‘నిలబెట్టిన’ విజయశాంతికి తప్ప అతని జీవితంలో ఇంకెవరికి చోటుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. విజయశాంతి తండ్రి నుంచి కొన్ని అడ్డకుంలు వస్తాయి. వాటిని ఆ హీరో దాటే సన్నివేశం గురించి ఎన్ని పేజీల్లో చెప్పినా తక్కువే ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వమే మనమూ అలవర్చుకోవాలన్నంత గొప్పగా ఆ సన్నివేశాలు రాసుకుని, తీశాడు దర్శకుడు.
ఇక పెళ్లి తర్వాత అత్తా కోడళ్ల మధ్య చిన్నచిన్న అలకలు కామన్. వాటిని సమన్వయం చేస్తూ హీరో మళ్లీ ఒక గొప్ప పరిణతి చూపించడం లాంటివి చూస్తే ఇవన్నీ మధ్య తరగతిలోనే కాదు.. అన్ని తరగతుల మనుషుల్లోనూ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కదా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అసలైన ‘‘స్కీమ్’’ మొదలవుతుంది. అది వెండితెరపై చూస్తేనే తెలుస్తుంది. ఆ స్కీమ్ లోని స్కామ్ ను తెలుసుకుని మన చిరంజీవి ధైర్యంగా ఛేదించడం వాస్తవానికి అతి దగ్గరగా ఉంటూ అత్యాశ, కోరికల వల్ల మనుషులు ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది సుతిమెత్తగా చెబుతూ.. సున్నితంగా హెచ్చరిస్తూ.. కథ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా.. అద్భుతమైన ఎమోషన్స్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేసే సినిమా షరతులు వర్తిస్తాయి.
చిరంజీవి పాత్రలో చైతన్యరావు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆ పాత్రలో జీవించాడు. కన్నడ నటి భూమిశెట్టి డబ్బింగ్(నటి శరణ్య చెప్పడం వల్ల అక్కడక్కడా తనే కనిపిస్తుంది) కాస్త ఇబ్బంది పెట్టినా ఆమె నటన అద్భుతం. ఇతర పాత్రలన్నీ చాలా సహజంగా ఎక్కడా సినిమాటిక్ డ్రామా కనిపించకుండా.. సెటిల్డ్ గా కనిపిస్తాయి. అన్ని పాటలూ బావున్నాయి. సాహిత్య పరంగా దర్శకుడిలో గొప్ప టేస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్దటింటి అశోక్ రాసిన‘పన్నెండు గుంజలా పందిర్ల కింద’ ప్రతి తెలంగాణ పెళ్లిలోనూ వినిపించే పాట అవుతుంది. పాటల చిత్రీకరణ సైతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బావుంది.
ఇలాంటి సినిమాలు రావాలి. మానవీయ విలువలను గురించి ఆలోచనలను రగుల్చుతూ.. వినోదాత్మకంగా చెప్పగలిగే ఇలాంటి దర్శకులను ఎంకరేజ్ చేయాలి. పోస్టర్ లాంచ్ చేసినప్పుడు త్రివిక్రమ్ చెప్పినట్టు ఇది ఎలాంటి షరతులూ లేకుండా.. సకుటుంబ సమేతంగా చూడదగ్గ/ చూడాల్సిన సినిమా.
- బాబురావు కామళ్ల