SIIMA 2023 Awards: ఉత్తమ నటుడు జూ.ఎన్టీఆర్, ఉత్తమ నటి ఎవరంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై ఎమోషనల్గా మాట్లాడుతూ.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేశారు.
నేను కింద పడ్డప్పుడు పైకి లేపారు : ఎన్టీఆర్
బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ అవార్డు సాధించినందుకు ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(జక్కన్న)కి ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. ''నన్ను మళ్ళీ మళ్ళీ నమ్మినందుకు, కొమరం భీమ్ పాత్రకు న్యాయం చేస్తానని నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్'' అని తెలియజేశారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో తనతో పాటు నటించిన రామ్ చరణ్ (Ram Charan)కు కూడా థాంక్స్ చెప్పారు. అతడిని బ్రదర్ అని పేర్కొంటూ తనకు చాలా సపోర్ట్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.... ''అభిమానులు అందరికీ థాంక్యూ. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు'' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ వేడుకల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ అవార్డులు అందుకున్నారు. సైమా 2023లో అత్యధిక అవార్డులు అందుకున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' అని చెప్పవచ్చు. రాజమౌళి కుటుంబం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాలేదు. రాజమౌళి అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా... కీరవాణి అవార్డును చంద్రబోస్ అందుకున్నారు.
సైమా 2023 విజేతల వివరాలు
ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ నటి - శ్రీ లీల (ధమాకా )
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సినిమా - సీతా రామం (వైజయంతి మూవీస్ అశ్వినీదత్, స్వప్న సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ ఛాయాగ్రాహకుడు - కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సాహిత్యం - చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - అడివి శేష్ (మేజర్ )
ఉత్తమ నటి (క్రిటిక్స్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - వశిష్ఠ (బింబిసార )
బెస్ట్ డెబ్యూ (హీరో) - అశోక్ గల్లా (హీరో)
బెస్ట్ డెబ్యూ (హీరోయిన్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం )
బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడ్యూసర్స్ - శరత్ & అనురాగ్ (మేజర్ )
సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ - కార్తికేయ 2
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి - సంగీత (మాసూద)
ఉత్తమ విలన్ - సుహాస్ (హిట్ 2)
ఉత్తమ హాస్యనటుడు - శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2)
ఫ్యాషన్ యూత్ ఐకాన్ - శృతి హాసన్!
ప్రామిసింగ్ స్టార్ - బెల్లంకొండ గణేష్!