KS Chitra: సోషల్ మీడియాలో సింగర్ చిత్ర పోస్ట్.. నెటిజన్స్ ఫైర్!
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో ప్రముఖ గాయని కె.ఎస్.చిత్ర విడుదల చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ వివాదాస్పదంగా మారింది. జనవరి 22 వ తేదీ సోమవారం నాడు ప్రజలంతా కూడా రామనామాన్ని జపించడంతో పాటు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ చిత్ర సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఆమె పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు ప్రతి భారతీయుడు కూడా శ్రీ రామ జయ రామ, జయ జయ రామ అంటూ రామ మంత్రాన్ని జపించాలని, అదే విధంగా ఆరోజున ఇంట్లో ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించి రాముల వారి ఆశీర్వాదాన్ని పొందాలని ఆమె సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. చివరిలో ఆమె లోక సమస్త సుఖినో భవంతు అంటూ ఆమె వీడియోని ముగించారు. ఇప్పుడు ఈ వీడియో పై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు హోరెత్తుతున్నాయి.
ఈ వీడియోను చూసిన గాయకుడు సూరజ్ సంతోష్ స్పందించారు. లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పడం గాయని చిత్ర అమాయకత్వమంటూ పేర్కొన్నారు. మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతుంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. అంతేకాకుండా గాయని చిత్ర తన నిజస్వరూపాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మరికొందరు నెటిజన్లు కూడా ఆమె పోస్ట్ చేసిన వీడియో గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా అది తప్పు అంటూ పేర్కొన్నారు. ఆమె ఓ రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపారంటూ తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే మరో గాయకుడు జి. వేణుగోపాల్ మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ, హక్కు ఆమెకు ఉన్నాయని అన్నారు. ఆమె మనో భావాలను కావాలని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు.