స్లమ్ డాగ్ హస్బెండ్ రివ్యూ.. సంజయ్, ప్రణవిల సినిమా ఎలా ఉందంటే..

Update: 2023-07-29 08:46 GMT

నటీనటులు : సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, 'ఫిష్' వెంకట్, మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు

ఛాయాగ్రహణం : శ్రీనివాస్ జె రెడ్డి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సహ నిర్మాతలు : చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల

నిర్మాత : అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

రచన, దర్శకత్వం : ఏఆర్ శ్రీధర్

కథ, కథనం కొత్తగా ఉండాలేగానీ చిన్నసినిమాలను సైతం ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకులు, నటులు సైతం ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుక్కను పెళ్లి చేసుకున్న ఓ కుర్రాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న కథాంశంతో రూపొందిన స్లమ్ డాగ్ హజ్బెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిట్ట కథ సినిమా హీరో సంజయ్ రావు కొంత గ్యాప్ తర్వాత నటించిన ఈ చిత్రంలో అతనికి జంటగా ఉయ్యాల జంపాల ఫేమ్ ప్రణవి మానుకొండ కనిపించింది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపురెడ్డి నిర్మాతలుగా మైక్ మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా..?

కథేంటంటే

పార్సీగుట్టకు చెందిన లక్ష్మణ్ అలియాస్ లచ్చిగాడు (సంజయ్ రావు), మౌనిక( ప్రణవి మానుకొండ) లవర్స్. రోజూ గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. ఇంట్లో తెలిసిపోవడంతో పార్క్ కు మకాం మారుస్తారు. పోలీసుల ఎంట్రీతో అక్కడి నుంచి ఓ ఖాళీ బస్ లో రొమాన్స్ మొదలెడతారు. విషయం తెలిసి పోలీసులు లచ్చిగాడిని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ మానుకొని పెళ్లి చేసుకోమని పోలీసులు ఇచ్చిన సలహాతో పెళ్లికి సిద్ధమవుతారు. అయితే లక్ష్మణ్, మౌనికల డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవడంతో ముహూర్తం పెట్టేందుకు ఆటకం ఏర్పడుతుంది. పుట్టిన రోజులు తెలియనందున జాతకంలో దోషముంటే కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతారని పంతులు భయపెడతాడు. దోషం పోయేందుకు ముందు చెట్టు లేదా జంతువుకు తాళి కట్టమంటాడు. లక్ష్మణ్ స్నేహితుడు

యాదమ్మ రాజు సలహా మేరకు ఓ కుక్కని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మౌనికతో పెళ్ళికి రెడీకాగా.. తన కుక్కని పెళ్లి చేసుకుని వదిలేసి మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతున్నాడు అని దాని ఓనర్ లక్ష్మణ్పై కేసు పెడతారు. విషయం కోర్టుకు చేరుకుంది. కుక్కతో జరిగిన పెళ్లి లచ్చిగాడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? కోర్టులో ఏం జరిగింది? కుక్కకు విడాకులిచ్చి ప్రియురాలిని సొంతం చేసుకున్నాడా ? అసలు కుక్కతో పెళ్లి వెనుక ఉన్న కుట్ర ఏంటి అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే..

చిన్న కాన్సెప్ట్ను ఫన్నీగా, ఆద్యంతం అలరించేలా ఆడియెన్స్ ని బోర్ కొట్టించకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే చాలు సినిమా హిట్‌ అనే దానికి స్లమ్ డాగ్ హస్బెండ్ నిదర్శనం. కుక్కని పెళ్లి చేసుకోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు. జీవితం ఎంత గందరగోళంగా మారిపోయిందనేది కామెడీతో పాటు ఫన్నీ వేలో చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ని రొమాంటిక్‌గా చూపించారు. కుక్కతో పెళ్లి తర్వాత వచ్చే సన్నివేశాలను ఫన్ వేలో తీసుకెళ్లిన తీరు బాగుంది. కామెడీతో నవ్వులు పూయించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం, లాయర్లుగా సప్తగిరి, బ్రహ్మాజీల వాదనలు జడ్జిగా ఫిష్ వెంకట్ ఇంగ్లీష్ నవ్వు తెప్పిస్తాయి. కేసు నుంచి బయటపడేందుకు హీరో చేసే పనులు సైతం ఫన్‌ జనరేట్‌ చేస్తాయి. సినిమా ఒకవైపు ఫన్ వేలో సాగుతూనే సమాజంలో మూడ నమ్మకాలకు ప్రశ్నించేలా, సెటైర్లు వేసేలా ఉంటుంది. ప్రజల నమ్మకాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేసే హడావుడు వంటి వాటిని ఫన్నీవేలో చూపించారు. ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. జంతువులు చూపే ప్రేమ, విశ్వాసం గురించి చెప్పిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే..

లచ్చిగాడు పాత్రలో సంజయ్‌ రావు బాగా చేశాడు. మౌనిక పాత్రలో ప్రణవి ఇరగదీసింది. యాక్టింగ్ డైలాగులతో మెప్పించింది. సినిమాలో యాదమ్మ రాజు కొత్తగా చూపించారు. రాజు చేసే కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. సంజయ్‌ రావు అమ్మ పాత్ర, అలాగే ప్రణవి తండ్రిగా చేసిన మురళీధర్‌ గౌడ్‌ పాత్రలు మెప్పిస్తాయి. బ్రహ్మాజీ, సప్తగిరి, ఫిష్‌ వెంకట్‌ కామెడీతో అలరించారు. సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో కుక్క ఓనర్ గా వేణు పొలసాని సైతం మెప్పించాడు. స్లమ్ డాగ్ హస్బెండ్ తో డైరెక్టర్ ఏఆర్ శ్రీధర్ సహజమైన కామెడీ పండించారు. అదే సమయంలో ట్రెండ్ కు తగ్గట్లుగా మూవీని క్రేజీగా తెరకెక్కించాడు. ఎడిటింగ్‌, కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌ గా నిలిచింది. మాస్‌ బీట్స్ అదిరిపోయాయి ఇకపై పెళ్లి బరాత్ లలో ఇవే పాటలు మారుమోగుతాయి. రెట్రో సాంగ్‌ మరో హైలైట్‌ అవుతుంది. భీమ్స్ సిసిరోలియో బీజీఎంతో దుమ్ములేపాడు. ఫైనల్ గా చెప్పేదేంటంటే స్లమ్ డాగ్ హస్బెండ్ కు ఫ్యామిలీతో వెళ్లి కడుపుబ్బా నవ్వుకోండి.






Tags:    

Similar News