టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్కు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ షాకిచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో గతేడాది విడుదలైన మూవీ కీడాకోలా ఆయనను చిక్కుల్లో పడేసింది. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీగా నిలిచిన కీడాకోలాలో అనుమతి లేకుండా తన తండ్రి వాయిస్ వాడుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్కు రెడీ అయ్యారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితం లీగల్ నోటీసులు పంపారు. ఇప్పుడు ఏకంగా పరిహారం విషయంలో అల్టిమేటం ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
తరుణ్ భాస్కర్ రూపొందించిన కీడా కోలా మూవీలో ఓ సన్నివేశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ని వాడుకున్నారు. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఆయన వాయిస్‌ని సినిమాలో ఉపయోగించారు. అయితే ఇందుకోసం ఎస్పీబీ కుటుంబసభ్యుల పర్మిషన్ తీసుకోకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. తమ అనుమతి లేకుండా తన తండ్రి వాయిస్ వాడుకోవడంపై ఎస్పీ చరణ్ తీవ్ర అసంతృప్తితోఉన్నారు. ఎస్పీబీ వాయిస్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రీ క్రియేట్ చేసి కీడాకోలా సినిమాలో వాడుకున్నందుకు ఆ చిత్ర నిర్మాతతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్‌లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన ఎస్పీ చరణ్ తరఫు లాయర్.. అనుమతి లేకుండా వాయిస్‌ను వాడుకున్నందుకు కీడాకోలా టీం క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి పరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తరుణ్ భాస్కర్ ఇంకా స్పందించలేదు.
పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’లో చైతన్య రావు, రాగ్ మయుర్, బ్రహ్మనందం ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.