ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సీతగా కృతిసన్ కనిపించనుంది. రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ సందర్భంగా మూవీ టీం కీలక ప్రకటన చేసింది. ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఓ సీటు కేటాయిస్తామని ప్రకటించారు.
మూవీ టీం చెప్పినట్లే రామ నామం వినబడే ప్రతి చోటుకి హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఆంజనేయుడి కోసం ప్రతి థియేటర్లో ఓ సీటు ఖాళీగా ఉంచుతున్నారు. మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో హనుమంతుడికి కేటాయించే సీటు ఎలా ఉండనుందన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ ఫోటోను చూస్తే హాల్లోని ఒక సీటును కాషాయ రంగు బట్టతో అలంకరించారు. దానిపై సీతారామ రూపాలను గుండెల్లో దాచుకున్న హనుమంతుడి చిత్ర పటంతో పాటు 'జై శ్రీరామ్' నినాదం ముద్రించి ఉంది.
ఇదిలా ఉంటే ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీటు పక్క దాన్ని భారీ ధరకు అమ్ముతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హనుమంతుడి పక్క సీటు కోసం భారీ మొత్తం చెల్లించేందుకు కొందరు వెనకాడటం లేదని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన మూవీ యూనిట్ ఈ వార్తల్ని ఖండించింది. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది. ఆదిపురుష్లో మరాఠి నటుడు దేవదత్తా నాగే హనుమంతుడి పాత్ర పోషించాడు.