Record Break : పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్ - ట్రైలర్ కు మంచి స్పందన

Byline :  Babu Rao
Update: 2024-02-19 11:49 GMT

దేశభక్తిని రగిలించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని సినిమాలు సాధారణంగా మొదలై అసాధారణమైన రీతిలో ఆకట్టుకుంటాయి. త్వరలో రాబోతోన్న రికార్డ్ బ్రేక్ సినిమా కూడా ఇలాగే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో హీరోలను ఎన్నుకుని, వారికి భిన్నమైన నేపథ్యంలో కథనం రాసుకుని, అందరూ వద్దనుకున్నవాళ్లతోనే దేశానికి పతకాలు తెస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనకు దృశ్య రూపంగా ఈ సినిమా ఉండబోతోందిన ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడున్న అన్ని జోనర్స్ కి భిన్నంగా.. ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణంగా ఎలా మారారు అనేది కథతో రూపొందిన సినిమాగా కనిపిస్తోంది. సరికొత్త బ్యాక్ డ్రాప్ తో విభిన్నమైన కథ, కథనాలతో కనిపిస్తోన్న ఈ రికార్డ్ బ్రేక్ మూవీ ట్రైలర్ తోనే ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రాన్ని చదలవాడ శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత రామసత్యనారాయణ, తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లాంచ్ చేశారు. అంతకు ముందు మాతృదేవో భవ వంటి గొప్ప సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ కుమార్ గ్లింప్స్ తో పాటు టీజర్ ను లాంచ్ చేశారు.

ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేశాడు దర్శకుడు. పుట్టగానే తల్లిని కోల్పోయిన ఇద్దరు కవలలు సమాజంలో ఎలాంటి ఛీత్కారాలు అనుభవించారు. వారి సామర్థ్యంతో దేశానికే గర్వకారణంగా ఎలా నిలిచారు అనే కాన్సెప్ట్ కొత్తగా కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి కథల్లో హీరోలంటే కండలు తిరిగిన వీరుల్లా ఉంటారు. బట్ ఈ ఇద్దరు హీరోలు అందుకు భిన్నంగా కనిపించడం విశేషం. అలాగే వారు ఏం చేసినా సాధించగలరు అనేలా వారి ఫిజిక్ తోడవడంతో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కు వీరే ప్రధాన బలం అనిపిస్తున్నారు. ఇక యాక్షన్ తో పాటు గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాహుబలి రేంజ్ అనుభూతిని ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి తెలుగుతో పాటు మరో ఏడు భారతీయ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ ప్యాన్ ఇండియన్ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.  

Tags:    

Similar News