ప్రపంచానికి నిజాలు తెలియాలి.. సుకేష్ చంద్రశేఖర్ మరో లెటర్..
మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా తనకు కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు ఈడీ ఛార్జ్ షీట్లను కొట్టివేయాలని అభ్యర్థించింది. సుకేశ్ తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేగాక, సుకేశ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తనను ట్రాప్ చేశాడని నటి తన పిటిషన్‌లో ప్రస్తావించింది. అయితే జాక్వలిన్ చర్య సుఖేష్ కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జాక్వెలిన్ పేరు ఎత్తకుండా ఆమెనుద్దేశించి ఓ లేఖ రాశాడు. సుఖేశ్ తరఫు న్యాయవాది దానిని మీడియాకు అందించాడు.
తాజా లెటర్ లో సుఖేష్ తాను నిరాధార ఆరోపణలు చేయలేదని, అవసరమైతే చాట్స్, స్క్రీన్‌షాట్స్, రికార్డింగ్స్, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు.. అన్నింటి గురించి బయటపెడతానని అన్నాడు. సదరు వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు మిలియన్ డాలర్లు చెల్లించానని, దానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లను బయటపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచానికి నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సుఖేష్ లెటర్ లో రాసినట్లు సమాచారం.
జాక్వెలిన్ పిటిషన్ ఫైల్ చేయడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని, ఎవరినైతే భద్రంగా చూసుకోవాలనుకున్నానో వారే ఎదురుతిరిగి వెన్నుపోటు పొడిచారని సుఖేష్ లేఖలో వాపోయాడు. తమను తాము బాధితులని చెప్పుకుంటూ నిందలు వేస్తున్నారని, తనను చెడ్డవాడిగా చూపించాలనుకుంటున్నారని అన్నాడు. హృదయం ఉన్నది ముక్కలవ్వడం కోసమేనని ఇప్పుడు అర్థమైందని ఇకపై వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదని సుకేశ్ తన లేఖలో రాసినట్లు తెలుస్తోంది.