బీఆర్ఎస్కు హ్యాండిచ్చి కాంగ్రెస్లో చేరనున్న తీగల..!

Update: 2023-07-18 14:41 GMT

అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తీగల తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.

టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్‌ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గానూ పనిచేశారు. 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై తెలుగుదేశం తరఫున బరిలో దిగి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరిన తీగల.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికయ్యారు. తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో కొంతకాలంగా వారి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని అసంతృప్తితో ఉన్న ఆయన.. బీఆర్ఎస్ సిట్టింగ్‌లకే టికెట్‌ వచ్చే అవకాశముందన్న సంకేతాలు రావడంతో పార్టీ మారడంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News