'వ్యూహం' సినిమాపై తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-01 13:31 GMT

వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన 'వ్యూహం' చిత్రంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. సినిమాపై తీర్పు రిజర్వ్‌ చేసింది హైకోర్టు. ఈ చిత్ర విడుదల అంశంపై గత కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ జీవితంలో కొన్ని కీలక రాజకీయ ఘట్టాల్ని తీసుకుని నిర్మించిన వ్యూహం చిత్రంలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీకి రాజకీయంగా మేలు చేసే విధంగా ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జీ ఈ చిత్రం విడుదలపై స్టే ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం చిత్రం రిలీజ్ కు బ్రేక్ పడింది.

టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్‌ జడ్జి... ‘వ్యూహం’ సినిమాకు సెన్సారు బోర్డు (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జనవరి 22న తీర్పు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌, దర్శకుడు రాంగోపాల్‌వర్మ హైకోర్టులో అప్పీలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. ‘వ్యూహం’ చిత్రంపై హైకోర్టులో వాదనలు ముగియగా.. సినిమాపై తీర్పు రిజర్వ్‌ లో ఉంచింది.

Tags:    

Similar News