Hero Siddharth Insulted : సిద్ధార్థ్ ను అవమానించిందెవరు

Update: 2023-10-03 12:29 GMT

హీరో సిద్ధార్థ్.. ఇంకా బొమ్మరిల్లు సిద్ధార్థ్ గానే చూస్తున్నాం. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై యేళ్లవుతున్నా.. ఇప్పటికీ అతన్ని లవర్ బాయ్ అనే అంటున్నారు. అయితే తెలుగులో అతను కంటిన్యూస్ గా సినిమాలు చేయడం లేదు. ఇందుకు కారణాలేంటీ అంటే చాలామంది చాలా చెప్పుకున్నారు. బట్ అతను చెప్పింది వింటే ఆశ్చర్యం వేస్తుంది. 2013 నుంచి 2023 వరకూ సిద్ధార్థ్ కు తెలుగు నుంచి వెళ్లిన స్క్రిప్ట్స్ మూడేనట. అందులో ఒకటి మహా సముద్రం అని చెప్పాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అయినా అప్పుడప్పుడూ డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు. వాటిలో కూడా విజయం సాధించిన ఏకైక సినిమా గ్రుహం మాత్రమే. బట్ అతని ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో. ప్రస్తుతం అతను చిన్నా అనే డబ్బింగ్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు. అది తనను అవమానించడం వల్లే అంటున్నాడు సిద్ధార్థ్.

సిద్ధార్థ్ తనే నిర్మిస్తూ నటించిన సినిమా చిత్తా. ఈ మూవీ ఒక పాప చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ ఎంటర్టైనర్. ఎప్పట్లానే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనుకున్నాడు. అందుకోసం తమిళ్ నుంచి ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ డిస్ట్రిబ్యూషన్ వారికి సినిమా చూపించాడట. ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేదు అని వెంటనే రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు అన్నాడు. అలాగే మళయాలం నుంచి గోకులం గోపాలన్, కన్నడ నుంచి కేఆర్జీ వంటి టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తన చిత్రాన్ని తమిళ్ తో పాటు సెప్టెంబర్ 28నే విడుదల చేశారు. బట్ తెలుగులో ఆ డేట్ కు విడుదల చేయాలనుకుంటే.. ఇక్కడ కొందరు డిస్ట్రిబ్యూటర్స్.. ‘సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు.. అతన్ని మన దగ్గర ఇంకెవరు పట్టించుకుంటారు.. ’ అన్నారట. ఈ విషయాన్ని చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్. చివరికి ఏసియన్ ఫిల్మ్స్ వాళ్లు ఈ శుక్రవారం ఈ చిత్రాన్ని చిన్నా పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. కంప్లీట్ ఎమోషనల్ రైడ్ గా ఈ చిత్రం రాబోతోంది. ఏదేమైనా తెలుగువాళ్లు తనను పూర్తిగా ఓన్ చేసుకోవడం లేదు అనే బాధ సిద్ధార్థ్ కు ముందు నుంచీ ఉంది. మరి చిన్నా రిజల్ట్ తర్వాత కూడా తన సినిమాలు ఎవరూ చూడరు అనుకుంటే ఇకపై తెలుగు గడ్డపై అడుగు పెట్టను అంటూ భీకర శపథం కూడా చేశాడు.

Tags:    

Similar News