Yash birthday : యశ్ బర్త్ డే రోజున విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు యువకులు మృతి..
కన్నడ స్టార్ హీరో యశ్కు బర్త్ డే రోజున విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా హీరో కావడంతో పలు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే యశ్కు బర్త్ విషెస్ చెబుతూ బ్యానర్ కట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో యశ్ బర్త్ డే ఫ్లెక్సీ కడుతుండగా.. ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. దాంతో వారు అక్కడికక్కడే మరణించారు. మృతులను హనమంత హరిజన్ (21), మురళీ నాదవినమణి (20), నవీన్ గాజి (19)గా గుర్తించారు. ఈ ఘటనలో మంజునాథ్ హరిజన్, ప్రకాష్ మాగేరి, దీపక్ హరిజన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే చంద్రు లమాని హాస్పిటల్కు వెళ్లి గాయపడిన వారితో మాట్లాడారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు చంద్రు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. అభిమానులతో కలిసి ఈసారి పుట్టిన రోజు జరుపుకోలేనని ముందే చెప్పారు.