టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

Byline :  Vamshi
Update: 2024-03-11 09:22 GMT

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2016లో విడాకులు తీసుకున్నారు. మాస్టర్‌ సురేష్‌ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన టాలీవుడ్‌లో 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత 'ధన 51, 'బ్రహ్మాస్త్రం', 'రాజుభాయ్‌', 'చాప్టర్‌ 6' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన 'అరసి’ చిత్రానికి ఆయనే దర్శకుడు. తెలుగులో రాక్షసుడు, దొంగ మొగాడు,'స్వయం కృషి', 'సంకీర్తన', 'ఖైదీ నం.786', 'కొండవీటి దొంగ' చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను, దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నారు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు


Tags:    

Similar News