కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. గురువారం సభ కాగా.. బుధవారం సాయంత్రమే ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా అమిత్ షా జూ.ఎన్టీఆర్, నితిన్, మిథాలా రాజ్ వంటి సినీ, క్రీడా ప్రముఖులను కలిశారు. ఈ సారి దర్శకుడు రాజమౌళి, సినీనటుడు ప్రభాస్‌లతో అమిత్ షా భేటీ అవుతారని సమాచారం. ఇరువురితో వివిధ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల కాలంలో అమిత్ షా, బీజేపీ నేతలు దేశంలోని ప్రముఖులతో భేటీ అవుతున్నారు. వివిధ రంగంలో రాణించిన వారిని కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలను, క్రీడాకారులను గతంలో అమిత్ షా కలిశారు. మరోసారి ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్‌లను కలుస్తారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 16న ‘ఆది పురుష్’ విడుదలకానున్న నేపథ్యంలో ప్రభాస్‌ను అమిత్‌షా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు తెలంగాణలో అమిత్ షా పర్యటనపై ఆసక్తి నెలకొంది. పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, సహా ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటెలకు బాధ్యతలు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణ టూర్‌కి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది.